Miryalaguda: ఆలస్యంగా పుట్టిన అమృత అంటే వాళ్ల అమ్మానాన్నలకు ఎంతో అపురూపం: డాక్టర్ జ్యోతి

  • అమృత తల్లికి నేనే డెలివరీ చేశాను
  • చాలా కాంప్లికేటెడ్ గా డెలివరీ జరిగింది
  • మారుతీరావు కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్
  • నా ఆసుపత్రి ముందు హత్యతో తేరుకోలేకపోయా
  • ఓ మీడియా చానల్ తో డాక్టర్ జ్యోతి

మారుతీరావు దంపతులకు వివాహమైన ఎంతో కాలానికి అమృత వర్షిణి పుట్టిందని, మారుతీరావు భార్య తన ఆసుపత్రిలోనే డెలివరీ చేసుకుందని మిర్యాలగూడకు చెందిన ప్రముఖ వైద్యురాలు జ్యోతి వెల్లడించారు. ఓ మీడియా చానల్ తో మాట్లాడిన ఆమె, ఆలస్యంగా పుట్టిన అమృతను అమ్మానాన్నలు ఎంతో అపురూపంగా చూసుకునేవారన్న సంగతి తనకు బాగా తెలుసునని చెప్పారు.

అమృత తల్లికి తానే రెగ్యులర్ గా చెకప్ చేసేదాన్నని దాదాపు పాతికేళ్ల నాటి సంగతులను ఆమె జ్ఞాపకం చేసుకున్నారు. ఆమె డెలివరీ కాంప్లికేటెడ్ గా జరిగిందని, ఆ తరువాత అమృత బాబాయ్ పిల్లల నుంచి ఎంతో మంది వారి ఇంట్లోని పిల్లలు తమ ఆసుపత్రిలోనే పుట్టారని చెప్పారు. అందువల్లే ఆ కుటుంబం తనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారారని, వాళ్ల ఇంట్లోని అన్ని ఫంక్షన్లకూ వెళ్లేదాన్నని అన్నారు.

అమృతతో తనకు చాలా మంచి పరిచయం ఉందని, తనను అత్తా అని పిలిచేదని గుర్తు చేసుకున్న డాక్టర్ జ్యోతి, అమృత గర్భం దాల్చిన తరువాత భయపడుతూనే తన వద్దకు వచ్చిందని అన్నారు. తాను కూడా అమృత పెళ్లి గురించి సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నానని, ఆ తరువాత ప్రెగ్నెన్సీ వచ్చిన తరువాతే కలిసిందని తెలిపారు.

పేరెంట్స్ సపోర్ట్ లేని కారణంగా, తాను ఆమెతో ఎక్కువ సేపు గడిపి, జాగ్రత్తలు చెబుతూ ఉండేదాన్నని, ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తూ వచ్చానని అన్నారు. ఈ క్రమంలో తన ఆసుపత్రి ముందు ఈ ఘటన జరగడం చాలా బాధను కలిగిస్తోందని అన్నారు. తన కళ్ల ముందే ప్రణయ్ కొన ఊపిరి పోవడంతో తాను కోలుకోవడానికి చాలాసేపు పట్టిందని డాక్టర్ జ్యోతి తెలిపారు.

More Telugu News