Kerala: ప్రముఖ మలయాళ సినీ నటుడు కెప్టెన్ రాజు కన్నుమూత!

  • 500 కుపైగా సినిమాల్లో నటించిన రాజు
  • ప్రతినాయకుడి పాత్రలతో పాప్యులర్ 
  • పలు తెలుగు సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు కెప్టెన్‌ రాజు(68)  ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ సహా పలు భాషల్లో 500కు పైగా సినిమాల్లో రాజు నటించారు. అంతేకాకుండా రెండు మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘రక్తం’ సినిమాతో 1981లో రాజు తెరంగ్రేటం చేశారు. తొలుత ఆర్మీ అధికారిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత.. నాటక రంగం, అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించారు.

‘బలిదానం’ ‘శత్రువు’ ‘రౌడీ అల్లుడు’ ‘కొండపల్లి రాజా’ ‘జైలర్‌ గారి అబ్బాయి’ ‘గాండీవం’ ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’ ‘మాతో పెట్టుకోకు’ వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. ప్రధానంగా విలన్ పాత్రలతో ఆయన పేరు తెచ్చుకున్నారు. మలయాళంలో 1997లో తొలిసారి ‘ఒరు స్నేహగథా’తో దర్శకుడిగా మారారు. అనంతరం 2012లో ‘పవనాయి 99.99’ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అందులో ప్రధాన పాత్రలో నటించారు.

ఈ ఏడాది జూలైలో కుమారుడి పెళ్లికి యూఏఈ వెళుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో విమానాన్ని కొచ్చీకి మళ్లించిన అధికారులు చికిత్స అందజేశారు. అప్పటి నుంచి రాజు ఆరోగ్యం దిగజారింది. ఆయన పలు మలయాళ టీవీ సీరియల్స్ లోనూ నటించారు. రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు.

More Telugu News