Anantapur District: తాడిపత్రి ఘర్షణలపై చంద్రబాబు ఆగ్రహం.. జేసీపై తీవ్ర అసంతృప్తి!

  • పోలీసులపై ముఖ్యమంత్రి గుస్సా
  • పరిస్థితి దిగజారుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్న
  • అసెంబ్లీలో ఈ విషయమై మాట్లాడనున్న చంద్రబాబు

అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలంలో చెలరేగిన హింసపై ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు దిగజారడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో అల్లర్లు చెలరేగితే చోద్యం చూస్తున్నారా? అని పోలీసులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా తాడిపత్రిలోని చిన్నపొడమల, పెద్దపొడమల గ్రామాల వద్ద అసలు ఏం జరిగిందో ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

గొడవ సందర్భంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారశైలిపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గొడవ జరిగినప్పుడు ఇరువర్గాలను రాజీకి ఒప్పించాల్సింది పోయి గ్రామస్తులతో కలసి ఆందోళనకు దిగడం ఏంటని ప్రశ్నించారు. అంతకుముందు జేసీకి ఫోన్ చేసిన చంద్రబాబు అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాడిపత్రిలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్లర్లపై అసెంబ్లీలో ప్రకటన చేయాలా? వద్దా? అన్న అంశంపై సీఎం అధికారులతో చర్చిస్తున్నారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా ఆశ్రమం మీదుగా వెళ్లరాదని ప్రబోధానంద స్వామి వర్గీయులు హెచ్చరించడంతో చిన్నపొడమల, పెద్ద పొడమల గ్రామస్తులు తిరగబడ్డారు. గ్రామస్తులకు జేసీ దివాకర్ రెడ్డి మద్దతుగా నిలవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ పాండియన్.. జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో, డీఎస్పీతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు.

More Telugu News