Andhra Pradesh: విద్యుదాఘాతంతో బీటెక్‌ విద్యార్థి మృతి: వినాయక ఉత్సవాల్లో విషాదం

  • మండపంపై మైక్‌లో మాట్లాడుతుండగా షాక్ 
  • అక్కడికక్కడే కుప్పకూలిపోయిన యువకుడు
  • కడప జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఘటన

వినాయక ఉత్సవాల్లో పెనువిషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో బీటెక్‌ విద్యార్థి ఒకరు మృత్యువాత పడ్డాడు. కడప జిల్లా రామాపురం మండల కేంద్రంలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే... రామాపురం కొత్తపేట చలపతి వీధికి ఎదురుగా ఉన్న వీధిలో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మండపంలో లైట్లు, ఇతర అవసరాల కోసం విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. విద్యుత్‌ సరఫరా బాక్స్‌లు కిందనే ఉన్నాయి. గురువారం ఉదయం 9 గంటల సమయంలో మదనపల్లి మిట్స్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రేమ్‌కుమార్‌ రెడ్డి మైకులో భక్తులకు సూచనలు చేస్తున్నాడు.

ఇంతలో మైకులోకి విద్యుత్‌ సరఫరా జరిగి షాక్‌ కొట్టి కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న వారు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మృతుని తండ్రి పిల్లల చదువు కోసం రామాపురం నుంచి కుటుంబాన్ని రాయచోటికి మార్చారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు రామాపురం వెళ్లిన ప్రేమ్‌కుమార్‌ రెడ్డిని మృత్యువు ఆ విధంగా మింగేసింది. మృతుని తండ్రి రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఈ సంఘటన రామాపురంతోపాటు రాయచోటి పట్టణంలోను సంచలనం రేపింది.

More Telugu News