paruchuri: 'బిగ్ బాస్ 2' షోలో కొన్ని గేమ్స్ చూస్తుంటే బాధేస్తోంది: పరుచూరి గోపాలకృష్ణ

  • పరిగెడుతూ ఆడపిల్లలు పడిపోయారు 
  • కార్లో నుంచి ఆడపిల్లలను నెట్టేసే ప్రయత్నం
  • ఇది క్రీడాధర్మం కాదు  

సినీ రచయితగా పరుచూరి గోపాలకృష్ణకి గల అనుభవం మాటల్లో చెప్పలేనిది. తను పనిచేసిన సినిమాలకి సంబంధించిన విషయాలపై 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా స్పందించే ఆయన, తాజాగా 'బిగ్ బాస్ 2' రియాలిటీ షోను గురించి ప్రస్తావించారు. 'బిగ్ బాస్ 2' షోలో జరిగే కొన్ని సంఘటనలను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. స్త్రీలు .. పురుషులు ఆకాశంలో సగం.. జనాభాలో సగం. కానీ శరీర నిర్మాణాన్ని బట్టి 'శక్తి'లో మాత్రం వాళ్లు సగం .. సగం కాదు అనే విషయం అందరికీ తెలిసిందే.

అలాంటిది 'బిగ్ బాస్ 2' లో స్త్రీ .. పురుషులకు కలిపి పోటీలు పెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్త్రీ .. పురుషులను కలిపి పరిగెత్తించారు .. అలా పరిగెడుతూ కొంతమంది ఆడపిల్లలు పడిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. ఇక ఇటీవల కార్లో నుంచి ఇద్దరు పురుషులు .. ఇద్దరు మహిళలను బలవంతంగా బయటికి నెట్టేయడానికి ప్రయత్నించడం నాకు చాలా బాధ కలిగించింది. బలవంతులు .. బలహీనులను నెట్టేసి గెలవడం క్రీడా ధర్మం కాదు. స్త్రీలు 'ఎక్కడైతే గౌరవించబడతారో .. అక్కడ దేవతలు కొలువై వుంటారు' అనే విషయాన్ని 'బిగ్ బాస్ 2' టీమ్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది" అంటూ ఆయన సూచించారు.     

More Telugu News