Police: ఫ్రెండ్లీ పోలీసింగ్: రూ.లక్షన్నర వెచ్చించి క్రిమినల్ కు ట్రీట్ మెంట్.. అనంతరం ఆసుపత్రిలోనే అరెస్ట్!

  • హైదరాబాద్ పోలీసుల మానవత్వం
  • నిందితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స
  • రిమాండ్ కు తరలించిన అధికారులు

సాధారణంగా నేరస్తుల పట్ల పోలీసులు కరుకుగా వ్యవహరిస్తారు. ఏదైనా ప్రమాదంలో వారు గాయపడ్డా, అనారోగ్యం వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వదిలేస్తారు. ఆపై ఏం జరిగినా పట్టించుకోరు. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా మానవత్వంతో స్పందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సరికొత్త అర్థాన్ని ఇచ్చారు.

పాతబస్తీలోని పహాడీషరీఫ్ ప్రాంతానికి చెందిన హబీబ్‌ అబ్దుల్‌ తాలా తనను తాను ‘పాతబస్తీ డాన్’ గా చెప్పుకుంటూ ఇక్కడ హల్ చల్ చేస్తుంటాడు. ఇతని ఇంట్లో అందరూ ఏదో ఒక పని చేసుకుని గౌరవంగా బతుకుతుండగా, అబ్దుల్ జులాయిగా తిరుగుతూ డబ్బుల కోసం చోరీలు, దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ లు చేస్తుంటాడు. అడ్డువస్తే ఎవరిపైనైనా దాడికి పాల్పడతాడు. గుర్రంపై స్వారీ చేస్తూ రహదారి వెంట వెళ్లే ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురిచేసి ఆనందం పొందుతుంటాడు. ఇతనిపై ఇప్పటికే రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో 16 కేసులు నమోదయ్యాయి. ఇటీవల పాతబస్తీలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో అబ్దుల్ ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో ఓ మహిళను వేధించిన ఘటనలో ఆమె తరఫు బంధువులు అబ్దుల్ ను ఈ నెల 3న పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తన వద్ద ఉన్న కత్తితో వారిపై దాడికి దిగాడు. ఈ సందర్భంగా వాళ్లందరూ కలసి అబ్దుల్ దగ్గరున్న కత్తితో అతడిని పొడిచి వెళ్లిపోయారు. అచేతనంగా పడిఉన్న అబ్దుల్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు తొలుత అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా చికిత్స కు అబ్దుల్ వద్ద డబ్బులు లేకపోవడంతో రాచకొండ కమిషనర్ సీపీ భగవత్ ఆదేశాలతో అధికారులే రూ.లక్షన్నర వరకూ ఖర్చుపెట్టారు. అనంతరం అతడిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తానే దాడి చేసినట్లు అంగీకరించడంతో అతను కోలుకున్నాక అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

More Telugu News