polavaram: చంద్రబాబు స్పీడును అందుకోలేక ఇబ్బందులు పడ్డ మంత్రులు, అధికారులు!

  • నిన్న పోలవరం గ్యాలరీ వాక్ చేసిన చంద్రబాబు
  • ఆయనను అందుకోలేక పోయిన ప్రజాప్రతినిధులు, అధికారులు
  • కాసేపు ఆగుదాం సార్ అన్న జలవనరుల శాఖ కార్యదర్శి

పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే గ్యాలరీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబసభ్యులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా గ్యాలరీ వాక్ చేశారు.

ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణం స్పిల్ వే గ్యాలరీ. దీని నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పోలవరం గ్యాలరీ విషయానికి వస్తే... దీని ఎత్తు 2 మీటర్లు, వెడల్పు రెండున్నర మీటర్లు. గ్యాలరీలో చిమ్మచీకటి ఉంటుంది. వెలుతురు కోసం ప్రత్యేకంగా లైట్లను అమర్చుకోవాలి. డ్యామ్ కింద భాగంలో ఇది ఉంటుంది. 26వ బ్లాక్ నుంచి 31వ బ్లాక్ వరకు గ్యాలరీ చాలా లోతులో ఉంటుంది. కొన్ని చోట్ల 18 మీటర్ల లోతు నుంచి దీన్ని నిర్మించారు. దీంతో, ఆ ప్రాంతంలో దాదాపు 14 అంతస్తుల భవనం దిగి, మళ్లీ అంత భవనాన్ని ఎక్కే స్థాయిలో మెట్లు ఉంటాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు హుషారు అందరికీ తెలిసిందే. గతంలో తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లినప్పుడు... ఎక్కడా ఆగకుండా పైకి ఎక్కిన ఘనత ఆయనది. నిన్నటి గ్యాలరీ వాక్ లో కూడా ఆయన అంతే హుషారుగా నడిచారు. ఆయనతో పాటు నడవడానికి మంత్రులు, అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆయనను అందుకోవడం వారికి కష్టసాధ్యంగా మారింది. పరిస్థితిని గమనించిన జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ సీఎం వద్దకు వెళ్లి, 'కాసేపు ఆగుదాం సార్' అని చెప్పారు. దీనికి సమాధానంగా, 'నడవలేక పోతున్నారా?' అంటూ చంద్రబాబు సరదాగా ప్రశ్నించారు.

చంద్రబాబు మనవడు దేవాన్ష్ కూడా తాతతో కలిసి 600 మీటర్లు నడిచారు. భువనేశ్వరి, బ్రాహ్మణిలు కిలోమీటరు మేర నడిచారు. దాదాపు 25 నిమిషాల సమయంలో చంద్రబాబు గ్యాలరీ వాక్ పూర్తయింది. 48వ బ్లాకు వద్ద లోపలకు ప్రవేశించిన చంద్రబాబు 1వ బ్లాకు నుంచి బయటకు వచ్చారు. 

More Telugu News