Chandrababu: చంద్రబాబుకు నోటీసులు వస్తే కోర్టుకు వెళతాం!: నారా లోకేశ్

  • తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడాం
  • టీడీపీ తెగువను ప్రజలు చూశారు
  • ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు పంపిస్తే న్యాయస్థానంలో హాజరవుతామని ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే 2010లో చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. ధర్మాబాద్ పోరాటంలో తెలుగుదేశం తెగువను ప్రజలు చూశారన్నారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలందరినీ నాడు అరెస్ట్ చేసినా తాము వెనక్కు తగ్గలేదన్నారు.

ప్రస్తుతం ఇతరుల జోలికి వెళ్లే తీరిక తమకు లేదనీ, ఇప్పుడు ఏపీని అభివృద్ధి చేసుకునే పనిలో తాము నిమగ్నం అయ్యామని వ్యాఖ్యానించారు. అమరావతిలో మంత్రి లోకేశ్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని లోకేశ్ తేల్చిచెప్పారు. అలాంటి ఆలోచన ఏదీ తమ మనసులో లేదన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణలో ఏర్పడ్డ తొలి ప్రభుత్వం పూర్తికాలం మనుగడ సాగించకపోవడం బాధాకరమని లోకేశ్ అన్నారు.

More Telugu News