Andhra Pradesh: ఏడు మండలాల పునర్విభజనపై మీ వైఖరి ఏంటి?: ఈసీ, తెలుగు రాష్ట్రాలను ప్రశ్నించిన హైకోర్టు

  • ఎన్నికలు ఆపాలని కాంగ్రెస్ పిటిషన్
  • పునర్విభజన తర్వాత జరపాలని విజ్ఞప్తి
  • కేంద్రం, ఈసీకి ధర్మాసనం నోటీసులు

2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కలిపిన 7 తెలంగాణ మండలాల పునర్విభజనపై అభిప్రాయాన్ని చెప్పాలని తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. నియోజకవర్గాల వారీగా వీటిని పునర్విభజన చేశాకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరపాలంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆయన తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ నిన్న హైకోర్టులో వాదిస్తూ.. ఈ ఏడు మండలాలలో 2.11 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

ఈ 7 మండలాలను ఏపీలో కలుపుతున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే జారీ చేసిందనీ, నియోజకవర్గాల వారీగా పునర్విభజన చేయలేదని కోర్టుకు తెలిపారు. ఈ మండలాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాకే తెలంగాణలో ఎన్నికలు జరిపించాలన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు.

వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్‌ , జస్టిస్ వి.సుబ్రమణియన్ ల ధర్మాసనం.. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఏపీ, తెలంగాణలకు నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా ఈ విషయంలో తమ వైఖరి ఏంటో తెలియజేయాలని ఈసీ కార్యదర్శి, కేంద్ర న్యాయ, హోంశాఖ కార్యదర్శులు, తెలుగు రాష్ట్రాల సీఎస్ లను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

More Telugu News