Ganesh Idols: రెచ్చిపోయిన ట్రాఫిక్ సీఐ.. గణేశ్ విగ్రహాలను కింద పడేసిన వైనం.. ఉద్రిక్తత!

  • రోడ్డుపై విగ్రహాలను తొలగించాలంటూ స్టాల్ యజమానితో గొడవ
  •  విగ్రహాలు విక్రయిస్తే తప్పేమిటన్న యజమాని 
  • హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆందోళన

హైదరాబాద్, లంగర్‌హౌస్ ట్రాఫిక్ సీఐ శివచంద్ర వ్యవహరించిన తీరు స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానిక బాపూనగర్ బస్టాప్ వద్ద ఓ వ్యక్తి గణేశుడి విగ్రహాలను విక్రయానికి పెట్టాడు. ఇది గమనించిన సీఐ శివచంద్ర వాటిని తీసేయాలంటూ వాగ్వివాదానికి దిగారు. తాను బొమ్మలను అక్కడి నుంచి తీయలేనని, బక్రీద్ సందర్భంగా రోడ్డుపై మేకలు విక్రయిస్తే తప్పులేనిది.. విగ్రహాలు విక్రయిస్తేనే తప్పా? అని ప్రశ్నించాడు.

దీంతో సీఐకి చిర్రెత్తుకొచ్చింది. గణేశ్ విగ్రహాలపై ప్రతాపం చూపాడు. అవి విగ్రహాలు మాత్రమే కాదని, వాటితో ఎన్నో సెంటిమెంట్స్ ముడివేసుకుంటాయన్న కనీస విచక్షణ మరిచి, దురుసుగా వాటిని కిందపడేశాడు. సీఐ తీరును చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆందోళనకు దిగారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని నిలదీశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివచంద్రను సస్పెండ్ చేసే వరకు ఆందోళనను విరమించేది లేదని తేల్చిచెప్పారు. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను శాంతింపజేశారు.

More Telugu News