Virat Kohli: ‘కోహ్లీని కెప్టెన్ పదవి నుంచి తీసేస్తున్నారు’ అన్న వార్తలపై స్పందించిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు!

  • గతేడాది పేలవ ప్రదర్శన చేసిన ఆర్సీబీ
  • కోచ్ వెటోరీపై వేటేసిన జట్టు యాజమాన్యం
  • సీజన్ కు రూ.17 కోట్లు అందుకుంటున్న కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఖరీదైన జట్లలో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఇప్పటిదాకా ఒక్క సీజన్ లోనూ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మెక్ కల్లమ్, డికాక్ వంటి హేమాహేమీ ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టు గత పదేళ్లలో 2009, 2011, 2016లో ఫైనల్స్ కు చేరుకోవడం మినహా గొప్ప ప్రదర్శన చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తప్పించాలని ఆర్సీబీ యాజమాన్యం అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

కోహ్లీ స్థానంలో ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్ ను జట్టుకు కెప్టెన్ గా చేసే అవకాశముందని ప్రచారం జరిగింది. దీనిపై ఆర్సీబీ జట్టు యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడనీ, అతడిని మార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. 2019 సీజన్ లోనూ ఆర్సీబీ జట్టుకు కోహ్లీనే సారథిగా వ్యవహరిస్తాడని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతీ సీజన్ కు ఆర్సీబీ యాజమాన్యం విరాట్ కోహ్లీకి రూ.17 కోట్లు చెల్లిస్తోంది. గత రెండు సీజన్లలో ఆర్సీబీ జట్టు ఘోరంగా విఫలం కావడంతో యాజమాన్యం కోచ్ డేనియల్ వెటోరీపై వేటువేసిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌కు బాధ్యతలు అప్పగించింది.

More Telugu News