India: భారత్ బంద్: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డెక్కిన కాంగ్రెస్, జనసేన నేతలు.. పలువురి అరెస్ట్!

  • భారత బంద్ కు విపక్షాల మద్దతు
  • పలు డిపోల ఎదుట నేతల బైఠాయింపు
  • సాధారణ జనజీవనానికి ఆటంకాలు

పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 'భారత్ బంద్' పిలుపునకు పలు పార్టీలు మద్దతు పలకడంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశాయి. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద తెల్లవారుజామునుంచే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆర్టీసీ సంఘాలు సైతం బంద్ కు మద్దతు తెలపడంతో వందలాది బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. తిరుపతిలో శ్రీవారి భక్తులను తిరుమలకు చేరవేసే బస్సులు మినహా మరేవీ నడవడం లేదు. విశాఖ, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ తదితర ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం కనిపిస్తోంది.

తణుకు, ఏలూరు, కడప తదితర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో కాంగ్రెస్, జనసేన, వామపక్ష కార్యకర్తలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, పలాస, టెక్కలి ప్రాంతాల్లో సినిమా హాల్స్ సైతం మూతపడ్డాయి. అన్ని బస్సు డిపోల వద్దా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

అచ్చంపేట డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై బంద్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. కరీంనగర్ బస్టాండ్ ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, శ్రీనివాస్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బంద్ సంపూర్ణంగా సాగుతోంది. ఈ బంద్ కు అధికార జేడీఎస్ కూడా మద్దతివ్వడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. విద్య, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. బంద్ కు మద్దతు తెలిపిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా పాఠశాలలను మూసివేశాయి. నేడు జరగాల్సిన డీఈడీ సెకండియర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

More Telugu News