Chandrababu: త్వరగా తేల్చేద్దాం... పొత్తులపై స్పీడ్ పెంచిన చంద్రబాబు!

  • వరుసగా రెండో రోజూ హైదరాబాద్ లోనే చంద్రబాబు
  • పొలిట్ బ్యూరో నేతలతో మరికాసేపట్లో చర్చలు
  • దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబునాయుడు

తెలంగాణలో అసెంబ్లీ రద్దయి, ముందస్తు ఎన్నికలు జరగనున్న వేళ, సాధ్యమైనంత త్వరగా పొత్తులపై తేల్చాలన్న ఉద్దేశంతో, వరుసగా రెండో రోజూ హైదరాబాద్ లోనే మకాం వేసిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు బిజీగా గడపనున్నారు. పొత్తులపై స్థానిక నేతలదే తుది నిర్ణయమని నిన్న వెల్లడించిన చంద్రబాబు, వివిధ పార్టీలతో చర్చల్లో పాల్గొనే నేతలకు నేడు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ ఉదయం 10 గంటలకు పొలిట్ బ్యూరోలోని టీటీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్న చంద్రబాబు, కాంగ్రెస్ తదితర పార్టీలతో చర్చించిన పక్షంలో, ఏ విధమైన వ్యూహాలను అమలు చేయాలన్న విషయమై సలహాలను, సూచనలను ఇవ్వనున్నారు. చంద్రబాబు నుంచి పిలుపును అందుకున్న ఎల్ రమణ, దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి, రావుల, రేవూరి, నామా తదితరులు ఇప్పటికే టీడీపీ కార్యాలయానికి చేరుకోగా, మరికాసేపట్లో చంద్రబాబు రానున్నారు. పొత్తులపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుని, సీట్ల పంపకాలు పూర్తి చేసుకుని, ప్రజల్లోకి వెళ్లి ప్రచారం ప్రారంభించాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

ఇదిలావుండగా, పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఓ కమిటీకి అప్పగిస్తూ, 'టీడీపీ వ్యూహ కమిటీ'ని నేడు చంద్రబాబు ప్రకటిస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ ను అడ్డుకుని, అధికారానికి దూరం చేయాలంటే, కాంగ్రెస్ సహా, కలసివచ్చే అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకోవాలని తెలుగుదేశం నేతలు గట్టిగా విశ్వసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News