Telangana: అనుకున్న దానికంటే ముందే ‘ముందస్తు’.. సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం!

  • అక్టోబరు 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్
  • నవంబరులో ఎన్నికలు
  • మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి ఓటింగ్ యంత్రాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అనుకున్న దానికంటే మరింత ముందుగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్టోబరు పదో తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూలు విడుదల చేసేందుకు ఈసీ రెడీ అవుతోంది. అదే జరిగితే నవంబరు చివరి వారంలో పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మరో నాలుగు రోజుల్లోనే ఓటింగ్ యంత్రాలు రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఓటర్ల జాబితా సవరణ గడువును కూడా కుదించిన ఈసీ సోమవారం ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది.

ప్రస్తుతం తెలంగాణలో 2.61 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా చేరేవారిని కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. తాజా వివరాలతో కూడిన జాబితాను వచ్చే నెల 8న ప్రకటించే అవకాశం ఉంది. నిజానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలతో కలిపి తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతాయని భావించారు. అయితే, వాటి కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. కాలపరిమితి కంటే ముందే రద్దయిన అసెంబ్లీకి తొలుత ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే ఇందుకు కారణమని సమాచారం.

More Telugu News