Chandrababu: వారం రోజుల్లోగా పరిస్థితి మెరుగుపడాలి.. లేదంటే సస్పెండ్ చేస్తా!: విశాఖ అధికారులకు చంద్రబాబు వార్నింగ్

  • అధికారులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్
  • విషజ్వరాల విజృంభణపై ఆగ్రహం
  • విశాఖలో వచ్చి కూర్చుంటానని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లో డెంగీ, మలేరియాలతో పాటు పలు అంటు వ్యాధులు ప్రబలడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వారం రోజుల్లోగా పరిస్థితి అదుపులోకి రాకుంటే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అమరావతిలో ఈ రోజు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డీహెచ్ఎంవోలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ వారం రోజులు ఎమర్జెన్సీ అన్న రీతిలో పనిచేయాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా అంటువ్యాధులు లేవనీ, ఒక్క విశాఖపట్నంలో మాత్రమే అంటు వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. హుద్ హుద్ తుపాను సమయంలో ఉన్నట్లే తాను ఇప్పుడు కూడా వైజాగ్ కు వచ్చి అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తానని తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ అధికారులు సెలవు రద్దు చేసుకోవాలన్నారు. ప్రజలకు అంటు వ్యాధులపై అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు.

More Telugu News