kalva srinivasulu: కేంద్రం ఇచ్చింది గోరంత‌.. ఏపీ చేసింది కొండంత: మంత్రి కాలువ

  • విష్ణుకుమార్ రాజు ప్రశ్నకు కాలువ సమాధానం
  • కేంద్రం ల‌క్ష ఇళ్లు నిర్మిస్తే.. ఏపీ నాలుగు ల‌క్ష‌లు 
  • మంత్రి కాలువ ప్రెస్ నోట్ 

ఏపీలో గృహ‌నిర్మాణాల‌కు స‌హాయం విష‌యంలో కేంద్రం ఇచ్చిన స‌హాయం గోరంతేన‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేసింది కొండంత అని గ్రామీణ గృహ‌ నిర్మాణ‌ శాఖ మంత్రి కాల‌ువ శ్రీనివాసులు అన్నారు. అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు.

గ్రామీణ‌, ప‌ట్ట‌ణ గృహ‌నిర్మాణాల‌కు కేంద్రం ప్ర‌భుత్వం ల‌క్ష‌న్న‌ర అందిస్తోంద‌ని, రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌న వాటాగా ల‌క్ష మాత్ర‌మే ఇస్తోంద‌ని విష్ణుకుమార్ రాజు ప్ర‌శ్నించారు. త‌న నియోజ‌వ‌క‌ర్గంలో 20 సంవ‌త్స‌రాల క్రితం నిర్మించిన 1300 ఇళ్లు శిథిలావ‌స్థ‌కు చేరాయ‌ని వాటి మ‌ర‌మ్మ‌తుల‌కు ఇంటికి ప‌దివేల రూపాయ‌లు మంజూరు చేయాల‌ని ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌న శాఖా మంత్రి నారాయ‌ణ, గ్రామీణ గృహ‌నిర్మాణ‌ శాఖ మంత్రి కాల‌ువ శ్రీనివాసుల‌కు విన‌తిప‌త్రాలు ఇచ్చినా నేటికీ స్పందించ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

దీనికి స‌మాధానంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, 2012లో దేశంలో 4 కోట్ల మందికి గ్రామీణులు త‌మ‌కు ఇళ్లు కావాల‌ని కేంద్రానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 2019 నాటికి కోటి ఇళ్లు క‌డ‌తామ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించారని, అయితే నేటికీ కూడా 45 ల‌క్ష‌లు కూడా పూర్తి చేయ‌లేని ప‌రిస్థితిలో కేంద్రం ఉంద‌ని ప్ర‌స్తావించారు. ప్ర‌ధాని త‌న సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్‌లో ఒక ల‌క్ష ఇళ్లు నిర్మాణం పూర్తి చేశార‌ని, వంద‌కోట్ల ఈ దేశంలో ఇదే అతి పెద్ద కార్య‌క్ర‌మం అని బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌చారం చేయ‌డం మ‌నంద‌రికీ తెలుసని చెప్పిన మంత్రి.. 5 కోట్ల జ‌నాభా, 13 జిల్లాలున్న మ‌న రాష్ట్రంలో ఇప్ప‌టికే ఘ‌నంగా 4 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి గృహ‌ప్ర‌వేశాలు అత్యంత ఘ‌నంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

కేంద్రం ఒక ల‌క్షా 50 వేలు గృహ‌నిర్మాణాల‌కు ఇస్తోంద‌ని చెప్ప‌డం క‌రెక్టు కాదని, రాష్ట్రంలోని వివిధ ప‌థ‌కాల కింద నిర్మిస్తున్న ఇళ్ల‌న్నింటికీ ఈ నిధులు కేంద్రం ఇవ్వ‌డంలేద‌నే విష‌యాన్ని స‌భ్యులు గుర్తించాల‌ని కోరారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ గృహనిర్మాణ సంస్థ ఆధ్వ‌ర్యంలో 13,28,965 ఇళ్లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ 6,45,082 ఇళ్లు పూర్తి చేశామ‌ని చెప్పారు. 2014-15 వ‌ర‌కూ 8,88,539 ఇళ్లు మంజూరు చేస్తే.. వీటిలో 2,79,283 ఇళ్ల‌కు మాత్ర‌మే కేంద్రం నుంచి నిధులు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. ఇందులో పీఎంఏవై ఎన్టీఆర్ అర్బ‌న్ ప‌థ‌కం కింద‌ 1,58,340 ఇళ్లు,  పీఎంఏవై గ్రామీణ గృహ‌నిర్మాణ ప‌థ‌కం కింద మంజూరైన 1,20,943 ఇళ్ల నిర్మాణానికి మాత్ర‌మే కేంద్రం సాయం చేసింద‌ని, ఇది కూడా 2 ల‌క్ష‌ల యూనిట్ ధ‌ర‌లో గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌బ్సిడీ కింద‌ 48,000 ఇస్తుండ‌గా, నేరుగా కేంద్రం నుంచి వ‌చ్చేది 72,000 మాత్ర‌మేనని గౌర‌వ స‌భ్యులు గుర్తించాల‌ని కోరారు.

ఇళ్ల నిర్మాణానికి 1/3 వంతు  కూడా కేంద్రం స‌హ‌కారం అంద‌డం లేద‌ని కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. విశాఖ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో నిర్మించిన ఇళ్లు ప్ర‌స్తుతం శిథిలావ‌స్థ‌కు చేరాయ‌ని, వాటి ఇంటి మ‌ర‌మ్మ‌తుల‌కు నిధుల మంజూరు విష‌యం మంత్రి నారాయ‌ణ దృష్టికి తీసుకొచ్చార‌ని, ఈ విష‌యం అధికారుల‌తో మాట్లాడి త‌ప్ప‌నిస‌రిగా నిధులిస్తామ‌ని చెప్పారు.

అసంపూర్తి ఇళ్ల‌కూ నిధులు

క‌ర్నూలు న‌గ‌ర శివారులోని జ‌గ‌న్నాథ గ‌ట్టుపై ఇళ్లు నిర్మించుకున్న ల‌బ్ధిదారులు చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారని, ఇక్క‌డ క‌నీస వ‌స‌తులు లేవ‌ని, కొంద‌రు ఇంటి నిర్మాణాలు స‌గంలోనే ఆపేశార‌ని క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి స‌భ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కాలువ శ్రీనివాసులు స్పందిస్తూ.. జ‌గ‌న్నాథగ‌ట్టు ప్రాంతాన్ని తాను సంద‌ర్శించాన‌ని, గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మంజూరైన‌  6,800 ఇళ్లు చాలా వ‌ర‌కూ అర్థాంతరంగా ఆగిపోయాయ‌ని తెలిపారు. మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డంతోపాటు అద‌నంగా మ‌రో  25 వేలు ల‌బ్ధిదారులకు ఇస్తామ‌ని హామీ ఇచ్చామని, నిర్మాణాలు ఆరంభ‌మైనట్టు చెప్పారు. నీటి వ‌స‌తి కూడా కల్పించాలని అడిగారని, క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి నీటి స‌మ‌స్య కూడా ప‌రిష్క‌రించాల‌ని చెప్పినట్టు మంత్రి స‌మాధానమిచ్చారు.

ఇళ్లు క‌ట్ట‌కుండానే గ‌తంలో బిల్లులు చేసుకున్నార‌ని, కాంగ్రెస్ పాపాల‌కు ల‌బ్ధిదారులు బ‌లైపోయార‌ని విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి స‌భ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కాలువ శ్రీనివాసులు స్పందిస్తూ, ల‌బ్ధిదారుల‌కు సంబంధం లేకుండానే బిల్లులు తినేసిన నేత‌ల‌పై ద‌ర్యాప్తు జ‌రిగింద‌ని, అధికారుల‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టామ‌ని తెలిపారు. 2014కి ముందు ఇంటి నిర్మాణం ప్రారంభం కాక‌పోయినా10 బ్యాగులు సిమెంట్ ఇచ్చి రాసుకున్న వారికి కూడా మిన‌హాయింపు ఇచ్చి, కొత్త ల‌బ్ధిదారులుగా గుర్తించి ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రికి తెలియ‌జేయ‌గా.. సీఎం సానుకూలంగా స్పందించార‌ని స‌భ దృష్టికి తీసుకొచ్చారు.

పామ‌ర్రు ఎమ్మెల్యే  ఉప్పులేటి క‌ల్ప‌న, కొండ‌పి ఎమ్మెల్యే బాల వీరాంజ‌నేయులు ఎస్సీ గృహ నిర్మాణ ల‌బ్ధిదారుల‌కు అద‌న‌పు రాయితీపై అడిగిన ప్ర‌శ్న‌కూ మంత్రి స‌మాధానమిచ్చారు.  ఎస్సీ ల‌బ్ధిదారుల‌కు అద‌నంగా రూ.50 వేలు ఇచ్చేందుకు ముఖ్య‌మంత్రి అంగీక‌రించార‌ని, 23.08.2018న ఆర్టీ 81 ద్వారా ఉత్త‌ర్వులు కూడా జారీ చేశార‌ని తెలిపారు. దీని ద్వారా 1,76,903 ఎస్సీ ల‌బ్ధిదారుల‌కు సాయం అంద‌నుంద‌ని తెలిపారు. ఎస్టీ ల‌బ్ధిదారుల‌కు మంజూరైన గృహాలు త్వరితంగా పూర్తయ్యేందుకు, అదనపు రాయితీగా పీవీటీజీలకు రూ.1 లక్ష, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు రూ.75 వేలు, మైదాన ప్రాంతాల గిరిజనులకు రూ.50 వేలు, షెడ్యూలు కులాల వారికి రూ.50 వేలు మంజూరుకు ఉత్త‌ర్వులిచ్చినట్టు కాలువ శ్రీనివాసులు వివ‌రించారు.

More Telugu News