Athletes: నిజమైన హీరోలంటే వారే!: తేల్చేసిన గౌతమ్ గంభీర్

  • ఏషియాడ్‌ అథ్లెట్లే నిజమైన హీరోలు
  • క్రికెటర్ల కంటే వారే గొప్ప
  • స్పష్టం చేసిన గౌతం గంభీర్

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గెలుపోటములతో పనిలేకుండా క్రికెట్‌కు ఆదరణ లభిస్తోంది. అయితే, క్రికెట్ నీడ మాటున జాతీయ క్రీడైన హాకీ సహా ఇతర క్రీడలకు సరైన ఆదరణ లభించడం లేదు. క్రీడాభిమానుల నుంచి ఆదరణ లేకున్నప్పటికీ క్రీడాకారులు మాత్రం నిరుత్సాహానికి గురికావడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా సత్తా చాటుతూనే ఉన్నారు.

తాజాగా ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన 18వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్టు గతంలో ఎన్నడూ లేనంతంగా పతకాలు కొల్లగొట్టి రికార్డు సృష్టించారు. వివిధ అంశాల్లో తొలిసారి బంగారు పతకాలు సాధించి చరిత్రను తిరగరాశారు.

అయితే, ఓ వైపు ఆసియా క్రీడలు జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్ ఆడుతోంది. పేలవ ప్రదర్శన కారణంగా 1-3తో సిరీస్ ను కూడా కోల్పోయింది. అయితే, ఏషియాడ్‌లో భారత్ పతకాలతో హోరెత్తిస్తున్నా క్రీడాకారులకు సరైన గుర్తింపు లభించకపోగా మీడియా ఫోకస్ మొత్తం భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌పైనే సారించింది.
తాజాగా ఈ విషయమై టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ఏషియాడ్ అథ్లెట్లే నిజమైన హీరోలని కొనియాడాడు. అడ్డంకులను అధిగమించి విజయాలు సాధించారని, క్రికెటర్ల కంటే వారే గొప్ప విజేతలని తేల్చి చెప్పాడు.

ఏషియాడ్‌లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. 15 బంగారు పతకాలు, 24 రజత, 30 కాంస్య పతకాలతో మొత్తం 69 పతకాలు సాధించారు. గతంతో పోలిస్తే భారత్‌కు ఇదే అత్యుత్తమం.

More Telugu News