Hanan Hamid: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ‘చేపల అమ్మాయి’ హనన్ హమీద్

  • దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
  • అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు
  • వెన్నెముకకు తీవ్ర గాయం

హనన్ హమీద్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. ఓవైపు డిగ్రీ చదువుకుంటూనే మరోవైపు కుటుంబ పోషణ, కళాశాల ఫీజుల కోసం ఖాళీ సమయాల్లో చేపలు అమ్మే హనన్ (21) పేరు అప్పట్లో మారుమోగింది. ఆమె చేపలు అమ్ముతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె పట్టుదలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముగ్ధుడై ఆపన్న హస్తం అందించారు. ఆమెకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు, ‘డాటర్‌ ఆఫ్‌ ది కేరళ గవర్నమెంట్‌’ అని ప్రశంసించారు.

కాగా, సోమవారం కోజికోడ్‌లో ఓ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లివస్తున్న హనన్  రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు కొడంగళూర్‌ వద్ద చెట్టును ఢీకొట్టింది. రోడ్డుపై అడ్డంగా వచ్చిన వ్యక్తిని తప్పించబోయిన డ్రైవర్ కారును ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో హనన్ వెన్నెముకకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను  కొడంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి  ఎర్నాకుళం తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

More Telugu News