‘12 వేళ్లున్న పిల్లాడిని బలి ఇస్తే డబ్బే డబ్బు’ అన్న తాంత్రికుడు.. బాబును చంపేందుకు వెంటపడుతున్న బంధువులు!
- ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో ఘటన
- బలి ఇవ్వాలని సలహా ఇచ్చిన తాంత్రికుడు
- వణికిపోతున్న తల్లిదండ్రులు
యూపీలోని బారాబంకి ప్రాంతానికి చెందిన దంపతులు ఇప్పుడు గజగజా వణికిపోతున్నారు. తమ పిల్లాడిని బలి ఇస్తే సంపద సిద్ధిస్తుందని ఓ తాంత్రికుడు చెప్పడంతో బంధువులంతా పిల్లాడిని ఎత్తుకెళ్లేందుకు తిరుగుతున్నారని బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తమ కుమారుడిని స్కూలుకు కూడా పంపడం లేదని వాపోయాడు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కూడా ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
ఈ విషయమై బారాబంకి సర్కిల్ ఆఫీసర్ ఉమాశంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని చెప్పారు. తాను పిల్లాడి చదువుకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తానని ఆయన తెలిపారు. బాధిత కుటుంబం పేదదనీ, తానిక్కడ ఉన్నంతవరకూ పిల్లాడిని ఆదుకుంటానని చెప్పారు.