Kerala flood: కేరళ వరదల్లో సాయం అందించిన మత్స్యకారులకు పోలీసు ఉద్యోగాలు!

  • 200 మంది జాలర్లను కోస్టల్ వార్డెన్లుగా నియమిస్తున్నట్టు ప్రకటన
  • వారి సాయంతోనే 65 వేల మందిని రక్షించినట్టు పేర్కొన్న మంత్రి
  • తీరప్రాంత యోధులుగా ప్రజల నుంచి గుర్తింపు

వరద బాధితులకు తమవంతు సాయం అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన మత్స్యకారులకు పోలీసు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వరదల్లో పగలనక, రాత్రనక సాయం అందించిన 200 మంది జాలర్లను పోలీస్ శాఖలో కోస్టల్ వార్డెన్లుగా నియమిస్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ప్రకటించారు. మత్స్యశాఖతో కలిసి ప్రతీ జిల్లాలోనూ ఓ రెస్క్యూ టీంను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. జాలర్ల సాయాన్ని గుర్తించిన ప్రజలు వారిని తీర ప్రాంత యోధులుగా కీర్తిస్తున్నారని పేర్కొన్నారు. మత్స్యకారుల సహకారం వల్లే 65 వేల మందిని రక్షించగలిగినట్టు వివరించారు.

వరద సహాయక చర్యల్లో పాల్గొన్న మత్స్యకారులను ముఖ్యమంత్రి పినరయి విజయన్ గత బుధవారం సత్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మత్స్యకారులు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ప్రశంసించారు. కేరళ ప్రజల తరపున తాను వారికి బిగ్ సెల్యూట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News