TRS: వాహనాలన్నీ కొంగరకలాన్ వైపే... జనం తంటాలు!

  • 70 శాతం బస్సులను బుక్ చేసుకున్న టీఆర్ఎస్
  • లారీలు, కార్లు, ఆటోలు కూడా లభించని పరిస్థితి
  • ఎంజీబీఎస్ నుంచి 1,063 బస్సుల రద్దు
  • ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
తెలంగాణలో నేడు ప్రయాణాలు పెట్టుకున్న వారికి, వివాహాది శుభకార్యాలు తలపెట్టుకున్న వారికీ తిప్పలు తప్పడం లేదు. బస్సుల నుంచి అద్దెలకు తిరిగే కార్లు, లారీలు, ఆటోలన్నీ ప్రగతి నివేదన సభ జరిగే కొంగరకలాన్ వైపు దారి తీస్తున్నాయి. నిత్యమూ ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండుల నుంచి ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలకు నడిచే 4,500 బస్సుల్లో దాదాపు 2,500 బస్సులను సభ నిమిత్తం టీఆర్ఎస్ బుక్ చేసుకుంది. దీంతో జిల్లాలకు బస్సులను నడిపే పరిస్థితులు లేవు. హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ బస్సుల్లో 70 శాతం వరకూ సభకు బయలుదేరి వెళుతున్నాయి. శనివారం రాత్రి నుంచి బస్సులు ప్రజలను సభ వద్దకు చేరవేసే పనిలో నిమగ్నం అయ్యాయి.

ఎంజీబీఎస్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే 1,063 బస్సులను రద్దు చేశారు. విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నప్పటికీ, ప్రయాణికుల నుంచి ఉన్న సాధారణ డిమాండ్ కు తగ్గట్టుగా కూడా బస్సులు లేని పరిస్థితి. ఇక పెళ్లిళ్లు పెట్టుకున్న వారు కూడా అద్దె కార్లు, ఇతర వాహనాలు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
TRS
Lorrys
Buses
MGBS
Journey
Kongarakalan

More Telugu News