Amit shah: టీఆర్ఎస్‌తో పొత్తుపై స్పష్టతనిచ్చిన అమిత్ షా.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ రెడీ!

  • తెలంగాణలో ‘ముందస్తు’కు బీజేపీ రెడీ
  • పార్టీ నేతలకు సూచనలిచ్చిన అమిత్ షా
  • ప్రచారానికి తాను వస్తానన్న జాతీయ అధ్యక్షుడు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్న వేళ.. బీజేపీ కూడా సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోనూ ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతోంది. అంతేకాదు, వీలైతే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ కావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, మోదీ ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడం, ప్రధాన పార్టీల్లోని అసంతృప్తులను పార్టీలోకి ఆకర్షించడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగాలని నిర్ణయించింది.

మంత్రాలయం వెళ్లేందుకు గురువారం హైదరాబాద్ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ ముఖ్యనేతలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌తో పొత్తుపై పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలోని హామీలు, వాటి అమల్లో వైఫల్యాలపై ఛార్జిషీటు జారీ చేసి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. కేంద్రం ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది తప్ప టీఆర్ఎస్ ప్రయోజనాల కోసం కాదని తేల్చి చెప్పారు. కేసీఆర్ చెబుతున్నట్టు వంద సీట్లు రావడం అసాధ్యమని పేర్కొన్న అమిత్ షా... ప్రచారానికి తాను కూడా వస్తానని పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం.

More Telugu News