jenasena: కష్టాల్లోని ప్రజలకు చేయూతనీయడమే ‘జనసేన’ ఆశయం: పవన్ కల్యాణ్

  • ‘జనసేన’లోకి తూ.గో.కు చెందిన పలు పార్టీల నేతలు 
  • పార్టీలోకి కందుల దుర్గేష్, నానాజీ
  • సాదర ఆహ్వానం పలికిన పవన్ 

ఇది మనందరి పార్టీ అని, కష్టాల్లో వున్న ప్రజలకు అండగా నిలబడి చేయూత నివ్వడమే ‘జనసేన’ లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.

మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) పార్టీలో చేరారు. వీరితో పాటు సుమారు ఐదు వందల మంది ‘జనసేన’లో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పార్టీలోకి కందుల దుర్గేష్, నానాజీలకు సాదర ఆహ్వానం పలుకుతున్నానని అన్నారు.  ఇది తన పార్టీ అని ఎప్పుడూ అనుకోలేదని, ‘నా’ అనే భావన ఎప్పుడూ తనకు ఉండదని, ‘మనది, మనం’ అనే భావనలే ఉంటాయని అన్నారు.

తాను నమ్మిన, సాధన చేసిన సిద్ధాంతాలనే చెబుతున్నానని, క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించాలని, నాలుగు గోడల మధ్య కూర్చుని సమస్యలను పరిష్కరిస్తామంటే కాదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, వాటికి పరిష్కరాలు చూపించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళదామని, రాజకీయాలు స్వల్పకాలిక ప్రయోజనాల కోసం చేయడం లేదని, దీర్ఘకాలిక ప్రయోజనాలతో, భావితరాల క్షేమం కోసం వచ్చానని పవన్ పేర్కొన్నారు.

ఈ రాజకీయాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా బలంగా నిలబడతానని, ఎంతటి ఒత్తిడి ఉన్నా ఎదుర్కొంటానని, పార్టీ కోసం చిత్తశుద్ధిగా పని చేసేవారికి అండగా ఉంటానని పవన్ తెలిపారు. రాజకీయాల్లో ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదని గీత గీసుకుని తాను రాలేదని చెప్పారు. ముఖ్యమంత్రి అవుతామా? ప్రభుత్వాలు స్థాపిస్తామా? అనేది తర్వాత, ముందు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పవన్ మరోసారి స్పష్టం చేశారు.

More Telugu News