Andhra Pradesh: పుంగనూరు ఆవు అంటే హరికృష్ణకు ఎంతిష్టమో.. మూడు రోజుల్లో చూసేందుకు వస్తానని మాటిచ్చిన వైనం!

  • బోరున విలపిస్తున్న శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు
  • మూడు నెలలకోసారి గ్రామానికి
  • బర్త్ డే తర్వాత వస్తానని మాటిచ్చిన హరికృష్ణ

దివంగత నటుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణకు పుంగనూరు ఆవు అంటే చాలా ఇష్టమట. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో శ్రీనివాసరావు అనే స్నేహితుడి ఫామ్‌‌హౌస్‌లో మహారాష్ట్రకు చెందిన ఓ గేదెతోపాటు పుంగనూరు ఆవును కూడా పెంచుతున్నారు. వీటిని చూసేందుకు మరో మూడు రోజుల్లో వస్తానని చెప్పిన ఆయన అంతలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నానని శ్రీనివాసరావు విలపిస్తూ చెప్పారు.

హరికృష్ణతో శ్రీనివాసరావు కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు నెలలకోసారి హరికృష్ణ గ్రామానికి వచ్చి గోవులను చూసి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లేవారు. పుంగనూరు ఆవు ఇటీవల ఓ దూడకు జన్మనివ్వడంతో దానిని చూడడానికి వస్తానని శ్రీనివాసరావుకు చెప్పారు. పుట్టిన రోజు తర్వాత వస్తానని శ్రీనివాసరావుకు మాటిచ్చారట. అయితే, అంతలోనే ఇలా జరగడాన్ని శ్రీనివాసరావు కుటుంబం తట్టుకోలేకపోతోంది.

ఓసారి కొందరు వ్యక్తులు ఓ గేదెను కబేళాకు తరలిస్తుంటే చూసిన హరికృష్ణ వారిని అడ్డుకుని దానిని శ్రీనివాసరావు వద్దకు తీసుకెళ్లారు. దానిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఇక తనకు ఎంతో ఇష్టమైన పుంగనూరు ఆవును తనతోపాటు హైదరాబాద్ తీసుకెళ్లాలని అనుకున్నారట. అయితే, దాని సంరక్షణ బాధ్యతలు కష్టంగా భావించిన ఆయన వెనక్కి తగ్గి శ్రీనివాసరావుకే ఆ బాధ్యతలు అప్పగించారట.

More Telugu News