astronaut: ముగ్గురు భారతీయులతో అంతరిక్ష యాత్ర.. ఖర్చు పదివేల కోట్లే.. వివరాలు ప్రకటించిన ఇస్రో!

  • 2022 మార్చిలో గగన్ యాన్ ప్రయోగం
  • సముద్రం లేదా నేలపై ల్యాండింగ్
  • 16 నిమిషాల్లోనే లాంచింగ్ పూర్తి

భారత్ చేపట్టనున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’పై ఇస్రో క్లారిటీ ఇచ్చేసింది. ఈ యాత్రలో భాగంగా తొలుత ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపుతామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. వీరు అక్కడ 5 నుంచి 7 రోజుల పాటు గడిపి భూమిపైకి తిరిగి వస్తారని వెల్లడించారు.

2022 నాటికి భారతీయులను అంతరిక్షంలోకి పంపుతామని ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 నాటికి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 6 నెలలు ముందుగానే ‘గగన్ యాన్’ చేపడతామని శివన్ తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం నిర్వహిస్తామన్నారు. ప్రయోగించిన 16 నిమిషాల్లోనే ఈ నౌక వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకుపోతుందని పేర్కొన్నారు.

అంతరిక్షంలో దాదాపు వారం రోజులు గడిపిన అనంతరం మాడ్యూల్ లో అరేబియా సముద్రం లేదా బంగాళాఖాతం లేదా భూమిపైన దిగవచ్చని వ్యాఖ్యానించారు. ఈ ప్రయోగం మొత్తం వ్యయం రూ.10,000 కోట్లకు మించదని శివన్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. భారత్ తరఫున తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తిగా రాకేశ్ శర్మ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 1984లో అప్పటి యూఎస్ఎస్ఆర్ (సోవియట్ రష్యా) ప్రయోగించిన సోయజ్ టీ-11 నౌకలో ఆయన అంతరిక్షయానం చేశారు.

More Telugu News