what`sup: భారత్ లో గ్రీవెన్స్ అధికారిని ఎందుకు నియమించలేదు?: ‘వాట్సాప్‌’కు సుప్రీంకోర్టు నోటీసులు

  • ‘సుప్రీం’లో ‘సెంటర్ ఫర్ అకౌంటిబిలిటి..’ పిటిషన్
  • దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం
  • నాలుగు వారాల్లోగా స్పందించాలని ‘సుప్రీం’ నోటీసులు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో వాట్సాప్ సంస్థ తరపున గ్రీవెన్స్ అధికారిని ఇంతవరకూ ఎందుకు నియమించలేదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ‘వాట్సాప్’ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, భారత్ లో గ్రీవెన్స్ అధికారిని నియమించని ‘వాట్సాప్’ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ సెంటర్ ఫర్ అకౌంటిబిలిటి అండ్ సిస్టమాటిక్ ఛేంజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

 ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర సమాచార, ఆర్థిక శాఖలకు కూడా నోటీసులు జారీ చేసింది. కాగా, ఫేస్ బుక్, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు భారత్ లో గ్రీవెన్స్ అధికారిని నియమించాయని, ‘వాట్సాప్’ కూడా తమ అధికారిని నియమిస్తే వినియోగదారుల వినతులను స్వీకరించి పరిశీలిస్తారని ఆ పిటిషన్ లో పేర్కొంది. గ్రీవెన్స్ అధికారిని నియమించే వరకూ వాట్సాప్’ ఎలాంటి పేమెంట్ సర్వీసులు కొనసాగించకుండా నిషేధం విధించాలని సుప్రీంకోర్టుకు సెంటర్ ఫర్ అకౌంటిబిలిటి అండ్ సిస్టమాటిక్ ఛేంజ్ విజ్ఞప్తి చేసింది.

More Telugu News