TRS: ప్రగతి నివేదన సభ కోసం ఒక్కొక్కరికి రూ.కోటి.. సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి!

  • డబ్బాల్లో సీల్ చేసి ఇచ్చారన్న రేవంత్
  • అందుకే ఎమ్మెల్యేలు ఎగబడ్డారని విమర్శ
  • విచారణ జరిపించాలని డిమాండ్

కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే నెల 2న జరగనున్న ప్రగతి నివేదన సభ నిర్వహణకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.కోటి నగదును బాక్సులో పెట్టి ఇచ్చారన్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ప్రత్యేకంగా సీల్ చేసిన డబ్బాల్లో ఈ నగదును ఎమ్మెల్యేలకు అందించారని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు.

ఈ డబ్బాల్లో ప్రగతి నివేదన ప్రచార సామగ్రి ఉందని చెబుతున్నారనీ, అయితే కోట్లాది రూపాయల ఆస్తులున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు రూ.2,000 విలువ ఉన్న ప్రచార సామగ్రి కోసం ఎగబడతారా? అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ సమక్షంలో ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున రూ.100 కోట్ల పంపిణీ జరిగిందన్నారు.

ఈ ఘటనను కేంద్రం, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పట్టించుకోకపోవడం దారుణమనీ, వెంటనే దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డబ్బాల్లో రూ.కోటి ఉందన్న సమాచారాన్ని టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నవారే తనకు ఇచ్చారని బాంబు పేల్చారు. ప్రగతి నివేదన సభకు 25 లక్షల మందిని తీసుకువస్తే.. ఖర్చులన్నీ కలిపి రూ.500 కోట్లు అవుతాయనీ, ఇంతమొత్తం నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని టీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు.

More Telugu News