Harvard Professor: 'కొబ్బరినూనె పచ్చి విషం' అన్న హార్వర్డ్ ప్రొఫెసర్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

  • అమెరికా ప్రొఫెసర్ కరిన్ వ్యాఖ్య
  • అత్యంత చెత్త ఆహారమని విమర్శ
  • ఘాటుగా జవాబిచ్చిన ప్రజలు

కొబ్బరి నూనె, పచ్చి కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయన్నది నిపుణులు చెప్పేమాట. దీని కారణంగా చర్మం నిగారిస్తుందనీ, జట్టు ఒత్తుగా పెరుగుతుందని చాలామంది బ్యూటీషియన్లు చెబుతారు. కానీ హార్వర్డ్ కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ మాత్రం చిత్రమైన వాదనను తెరపైకి తీసుకొచ్చింది. కొబ్బరి నూనె పచ్చి విషమనీ, దానికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.

ఇటీవల అమెరికాలో జరిగిన ఓ సమావేశంలో హార్వర్డ్ వర్సిటీకి చెందిన కరిన్ మిచెల్స్ అనే మహిళా ప్రొఫెసర్ ఈ వ్యాఖ్యలు చేసింది. కొబ్బరినూనె అన్నది అన్ని రోగకారకాలకు నిలయమని ఆమె వ్యాఖ్యానించింది. దానికి దూరంగా ఉండాలనీ, అది పచ్చి విషమని సెలవిచ్చింది. మనుషుల తీసుకోదగ్గ అత్యంత చెత్త ఆహారం ఇదేనని చెప్పింది.

ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయగా ఇప్పటివరకూ దాదాపు 10 లక్షల మంది చూశారు. కాగా,  కరిన్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. కొబ్బరి నూనె విషం అయితే హవాయి, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ ప్రజలు తరతరాలుగా విషం తీసుకుంటున్నట్లే అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. నందిని అనే మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘భారత్ లో తల్లులు తమ పిల్లలకు కొబ్బరినూనెతో మర్దన చేస్తారు. ప్రజలు తలకు రాసుకుంటారు. ఒక్క అమెరికాలో మాత్రమే ప్రతిదాన్నీ భూతద్దంలో చూస్తున్నారు’ అంటూ మండిపడింది. మిగతా భారతీయుల కంటే కొబ్బరినూనె ఆహారంలో భాగంగా తీసుకున్న ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉందని పంకజ్ అనే మరో నెటిజన్ చురకలంటించాడు.

More Telugu News