మరో మహిళతో మాస్టారి వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చావగొట్టిన భార్య!

23-08-2018 Thu 14:26
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
  • ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసిన భార్య
  • పిల్లల్ని, తనను పట్టించుకోవడం లేదని ఆవేదన
పిల్లలకు నీతులు చెప్పాల్సిన ఓ టీచర్ దారి తప్పాడు. భార్య, పిల్లలు ఉండగానే మరో మహిళతో రహస్యంగా కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

సిరిసిల్ల జిల్లా చెక్కపల్లిలో శ్రీనివాస్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే భార్య పద్మ ఉండగానే మరో మహిళ సంధ్యా రాణితో శ్రీనివాస్ కాపురం పెట్టాడు. ఈ విషయాన్ని పసిగట్టిన పద్మ ఈ రోజు వీరిద్దరూ ఇంట్లో కలసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బంధువులతో కలసి శ్రీనివాస్, అతని ప్రియురాలిని చావగొట్టింది. ఈ సందర్భంగా ఇంట్లోని వస్తువులను పద్మ, ఆమె బంధువులు ధ్వంసం చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో ప్రియురాలు సంధ్యా రాణి స్పందించింది. శ్రీనివాస్, తాను పెళ్లి చేసుకున్నామని చెప్పింది. తనపై దాడిచేసిన పద్మ, ఆమె బంధువులపై కేసు పెడతానని హెచ్చరించింది. గర్భిణిని అని కూడా చూడకుండా దాడి చేశారని సంధ్య వాపోయింది. చివరికి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్, సంధ్యలను స్టేషన్ కు తరలించారు.

భార్య పద్మ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. గత 10 రోజులుగా తన భర్త ఇంటికి రావడం లేదని వాపోయింది. సంధ్యా రాణికి భర్త, పిల్లలు ఉన్నప్పటికీ వారిని విడిచిపెట్టి తన భర్తను లోబర్చుకుందని ఆరోపించింది. నిన్న ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేయగా, తాను బయట ఉన్నట్లు శ్రీనివాస్ చెప్పాడని తెలిపింది. ఇద్దరు పిల్లలు, తనను శ్రీనివాస్ పట్టించుకోవడం మానేశాడని వాపోయింది. దీంతో ఈ రోజు బంధువులను వెంటబెట్టుకుని శ్రీనివాస్, సంధ్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపింది. తన భర్త లక్షలాది రూపాయలను సంధ్యకు ఇచ్చేశాడని ఆరోపించింది.