applicants: ప్రభుత్వ అకౌంటెంట్ పోస్టుకు పరీక్ష రాసిన 10 వేల మంది.. అందరూ ఫెయిలే!

  • 80 పోస్టులకు 10 వేల మంది హాజరు
  • ఒక్కరూ కనీస అర్హత మార్కులు సాధించలేదు 
  • దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు

అకౌంటెంట్ల పోస్టుల భర్తీ కోసం గోవా ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షకు 10 వేల మంది హాజరుకాగా, అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా పాస్ కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంగళవారం విడుదలైన ఈ ఫలితాలను చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. మొత్తం 80 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 10,815 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 80 పోస్టుల్లో 43 జనరల్ కేటగిరీలో, 21 వెనుకబడిన తరగతుల వారి కోసం, 9 షెడ్యూల్డ్ తెగలు, 2 షెడ్యూల్డ్ కులాలు, 2 స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు కేటాయించింది. మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులకు ఒక్కొక్క పోస్టు చొప్పున రిజర్వు చేసింది.

ఈ పోస్టుల భర్తీకి జనవరి ఒకటో తేదీన నిర్వహించిన పరీక్షలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఉత్తీర్ణత కాలేదని అకౌంట్స్ డైరెక్టర్ ప్రకాశ్ పెరీరా తెలిపారు. ఈ పరీక్షేమీ అంత కఠినమైనది కూడా కాదని, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చినట్టుగా ప్రశ్నలు ఇచ్చామని ఆయన వివరించారు. కనీస అర్హత మార్కులను కూడా ఎవరూ సాధించలేకపోయారని పేర్కొన్నారు.  

పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో ఒక్కరు కూడా పాస్‌ కాలేదని ప్రభుత్వం ప్రకటించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆరోపించింది. ఒక్కరు కూడా ఉత్తీర్ణత కాకుండా ఎలా ఉంటారని కాంగ్రెస్ ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి సందానంద్ షెట్ తన్వాడే మాట్లాడుతూ రిక్రూట్‌మెంట్ విధానంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

More Telugu News