Aam Aadmi Party: కేజ్రీవాల్‌కు మరో షాక్.. క్రియాశీల రాజకీయాలకు ఆశిష్ ఖేతన్ గుడ్‌బై!

  • ఆప్‌కు వరుస దెబ్బలు
  • న్యాయవాద వృత్తికి పునరంకితం కానున్న ఆశిష్
  • ఇటీవలే పార్టీకి గుడ్‌బై చెప్పిన అశుతోష్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆశిష్ ఖేతన్ ప్రకటించారు. ఇకపై తన మొత్తం దృష్టిని న్యాయవాద వృత్తిపై కేంద్రీకరించనున్నట్టు తెలిపారు. అయితే, పార్టీ వీడడంపై ఖేతన్ స్పష్టత ఇవ్వలేదు.

‘‘నేను ఇకపై పూర్తిగా లీగల్ ప్రాక్టీస్‌కే పరిమితం కావాలనుకుంటున్నా. క్రియాశీల రాజకీయాల్లో పాల్గొన కూడదని నిర్ణయించుకున్నా’’ అని ట్వీట్ చేశారు. న్యాయవాద వృత్తిలో చేరేందుకు ఏప్రిల్‌లోనే తాను డీడీసీకి రాజీనామా చేసినట్టు తెలిపారు.

ఖేతన్ నిర్ణయం ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. ఇటీవల ఆ పార్టీకి వరుసపెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు నేతలు ఇటీవల ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన ఖేతన్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు నమ్మినబంటు. ఖేతన్‌ను డీడీసీ ఉపాధ్యక్షుడిగా కేజ్రీవాల్ నియమించారు. అలాగే, ఆప్ ప్రభుత్వ సలహాదారుగా మూడేళ్లు పనిచేశారు. ఆప్ నేత అశుతోష్ ఈ నెల 15న పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి తప్పుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఆప్‌తో తన అనుబంధం ముగిసిందని పేర్కొన్నారు.

More Telugu News