Hyderabad: మల్టీప్లెక్సులకే సినిమాకు వెళ్లాలా? మూవీ చూసేటప్పుడే తినాలా?: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • తినుబండారాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని పిల్
  • విచారణ చేపట్టిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం
  • ఇది సరైన వేదిక కాదన్న న్యాయమూర్తులు

ఏదైనా సినిమా చూడాలంటే మల్టీప్లెక్సుల్లోనే చూడాలా? సినిమా చూసేటప్పుడే ఏదైనా తినాలా?... సినిమా హాళ్లలోకి తమ వెంట తినుబండారాలను తీసుకుని వెళ్లేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతూ తెలుగు రాష్ట్రాల హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ ల ధర్మాసనం, న్యాయవాది సతీశ్ కుమార్ దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపింది.

తూనికలు, కొలతలు, ఆహార భద్రత, సినిమా రెగ్యులేషన్ తదితర చట్టాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై ఓ పిల్ ద్వారా న్యాయ సమీక్ష సరికాదని కూడా న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సినిమా హాళ్లలో ఆహార పదార్థాల నాణ్యతపైగానీ, అధిక ధరలపైగానీ ఆరోపణలు ఉంటే వినియోగదారుల ఫోరాలను ఆశ్రయించాలని సలహా ఇచ్చింది. కాగా, మల్టీప్లెక్స్ లలో అధిక ధరలకు తినుబండారాలు అమ్ముతున్నారని, ప్రేక్షకులే తమ వెంట ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సతీశ్ కుమార్ ఈ పిల్ ను దాఖలు చేశారు. 

More Telugu News