Pakistan Army chief: మీకిస్తా... మీ అందరికీ అప్పుడు ఘాటుగా ఇస్తా: సిద్ధూ

  • పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని విమర్శల పాలైన సిద్ధూ
  • ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి
  • సమయం వచ్చినప్పుడు అందరికీ ఘాటుగా సమాధానం ఇస్తానని వెల్లడి

పాకిస్థాన్ వెళ్లి విమర్శల పాలైన మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ స్పందించారు. ముప్పేట తనపై జరుగుతున్న దాడిపై తీవ్రంగా స్పందించిన ఆయన అవసరం వచ్చినప్పుడు అందరికీ గట్టిగా సమాధానం చెబుతానని పేర్కొన్నారు.

‘‘నాపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన రోజు వచ్చినప్పుడు అందరికీ ఇస్తా. అది చాలా గట్టిగా ఉంటుంది’’ అని సిద్ధూ వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్‌ను ప్రేమగా ఆలింగనం చేసుకోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా సిద్ధూ చర్యను తప్పుబట్టారు. బజ్వాను హగ్ చేసుకోవడం తప్పేనని వ్యాఖ్యానించారు.

‘‘సిద్ధూ అలా చేయడం తప్పేనని అనుకుంటున్నా. జావేద్‌పై మరీ అంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. మన సైనికులు రోజూ అమరులవుతున్నారు. దీని వెనక ఎవరున్నదీ సిద్ధూ అర్థం చేసుకోవాలి. కొన్ని నెలల క్రితం నా సొంత రెజిమెంట్ కూడా ఓ మేజర్, ఇద్దరు జవాన్లను కోల్పోయింది’’ అని అమరీందర్ పేర్కొన్నారు. సిద్ధూ పాక్ వెళ్లాలన్నది అతడి వ్యక్తిగత నిర్ణయమని, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

పాకిస్థాన్ నుంచి ఆదివారం తిరిగొచ్చిన సిద్ధూ మాట్లాడుతూ తన చర్యలను సమర్థించుకున్నారు. కర్తార్‌పూర్‌లోని చారిత్రక గురుద్వారాకు మార్గాన్ని తెరుస్తామని చెప్పడంతో ఆనందంతోనే జావేద్‌ను కౌగిలించుకున్నానని వివరించారు.

‘‘ఎవరైనా (జావేద్‌ను ఉద్దేశించి) నా వద్దకు వచ్చి తాము కూడా అదే సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తామని, గురునానక్ 550వ జన్మదినం సందర్భంగా కర్తార్‌పూర్ సరిహద్దును తెరుస్తామని చెప్పినప్పుడు నేనేం చేయాలి?’’ అని ప్రశ్నించారు. ‘‘మిమ్మల్ని అతిథిగా ఆహ్వానించినప్పుడు మీరెక్కడో కూర్చున్నారు. అలాగే నేను కూడా ఎక్కడో కూర్చున్నాను. కానీ వారొచ్చి అక్కడ కూర్చోమని చెప్పారు’’ అని సిద్ధూ వివరించారు. కాగా, తనపై వెల్లువెత్తుతున్న విమర్శల జడివానపై స్పందిస్తూ.. అవసరం వచ్చినప్పుడు అందరికీ సరైన సమాధానాన్ని ఘాటుగా ఇస్తానని పేర్కొన్నారు.

More Telugu News