mitchell johnson: ఆ నిప్పులు చెరిగే బంతులు ఇక కనిపించవు.. ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్ రిటైర్మెంట్!

  • అన్ని ఫార్మేట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
  • ఆటకు శరీరం సహకరించడం లేదన్న జాన్సన్
  • కోచ్ లేదా మెంటారింగ్ బాధ్యతలు చేపడతానని వెల్లడి

ఆస్ట్రేలియా పేస్ యంత్రం మిచెల్ జాన్సన్(36) అన్ని రకాల క్రికెట్ ఫార్మేట్ల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ ఆడేందుకు తన శరీరం సహకరించడం లేదని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రెండేళ్ల క్రితం గుడ్ బై చెప్పిన జాన్సన్.. గత నెలలో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో ఆడే పెర్త్ స్కోరర్స్ జట్టు నుంచి తప్పుకున్నాడు.

‘నా కెరీర్ ముగిసింది. నా చివరి బంతిని నేను విసిరేశాను. చివరి వికెట్ ను కూడా తీసుకున్నాను. ఈ రోజు అన్ని ఫార్మేట్ల నుంచి తప్పుకుంటున్నా. మనం 100 శాతం ఫిట్ గా ఉంటేనే జట్టుకు న్యాయం చేయగలం. మరో ఏడాది పాటు క్రికెట్ ఆడగలననే అనుకున్నా. కానీ శరీరం సహకరించడం లేదు’ అని పెర్త్ నౌ వెబ్ సైట్ కు చెప్పాడు.

భవిష్యత్ లో తాను కోచ్, మెంటార్ గా పనిచేయడంపై దృష్టి సారిస్తానని జాన్సన్ తెలిపాడు. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో 2007లో చోటు దక్కించుకున్న జాన్సన్.. 73 టెస్టుల్లో 313 వికెట్లు పడగొట్టాడు. ఇక 153 వన్డేల్లో 239 వికెట్లను కూల్చాడు. 30 టీ20 మ్యాచులు ఆడిన జాన్సన్ 38 వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ ఓ సందర్భంలో జాన్సన్ ను ఈ తరంలోనే గొప్ప బౌలర్ గా అభివర్ణించాడు.

అన్ని రకాల క్రికెట్ ఫార్మెట్ల నుంచి తప్పుకున్నప్పటికీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇతర దేశీయ టీ20 టోర్నీల్లో ఆడే విషయమై జాన్సన్ స్పష్టత ఇవ్వలేదు. జాన్సన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

More Telugu News