Donald Trump: తమను శత్రువులుగా ప్రకటించడంపై ట్రంప్ పై అమెరికా మీడియా కన్నెర్ర!

  • మీడియాను దేశానికి శత్రువుగా ప్రకటించిన ట్రంప్
  • మండిపడ్డ 350 మీడియా సంస్థలు
  • అధ్యక్షుడి వైఖరిని వ్యతిరేకిస్తూ సంపాదకీయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, అక్కడి మీడియాకు మధ్య రగులుతున్న వివాదం మరింత ముదిరింది. ఇప్పటివరకూ మీడియాపై 'ఫేక్ న్యూస్' అనే ముద్రవేసిన ట్రంప్ తాజాగా మీడియా సంస్థలను ఏకంగా అమెరికా ప్రజలకు శత్రువులుగా ప్రకటించడం పట్ల పలు మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా సీఎన్ఎన్ చానల్ విలేకరిని ట్రంప్ లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది.

ట్రంప్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ గురువారం దాదాపు 350 అమెరికా పత్రికలు సంపాదకీయాలు రాశాయి. అందులో ట్రంప్ మీడియాను క్ష్యంగా చేసుకోవడంపై ఏకిపారేశాయి. తమకు నచ్చని వార్తలను ఫేక్ న్యూస్ గా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయం రాసింది. తాము కోరిన రాతలు రాయని పత్రికలను దేశానికి శత్రువులుగా ట్రంప్ ప్రకటిస్తున్నారని బోస్టన్ గ్లోబ్ పత్రిక మండిపడింది.

ఇక ఫిలడెల్ఫియా ఇన్ క్వైరర్ పత్రిక అయితే.. ప్రతీకార చర్యలు, వేధింపులు, శిక్షల నుంచి మీడియాకు స్వేచ్ఛ లేకపోతే.. ఆ దేశానికి, అక్కడి ప్రజలకు కూడా స్వేచ్ఛ లేనట్లే  అని సంపాదకీయాన్ని ప్రచురించింది. అనుకూలమైన వార్తలు ప్రచురించనంత మాత్రన అవి ఫేక్ న్యూస్ అయిపోదని న్యూయార్క్ పోస్ట్ సంపాదకీయం రాసింది.

More Telugu News