Uttar Pradesh: ఆలయంలో దారుణహత్యకు గురైన సాధువులు.. గోవధను వ్యతిరేకించడం వల్లేనని అనుమానం!

  • ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయాలో ఘోరం
  • నిద్రిస్తున్న మంచానికి కట్టేసి సాధువుల హత్య
  • రణరంగంగా మారిన ఔరైయా

గోవధను వ్యతిరేకించిన ఇద్దరు సాధువులు ఆలయంలోనే దారుణ హత్యకు గురయ్యారు. మరో సాధువు పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో మరోమారు చర్చనీయాంశమైంది. బుధవారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న ముగ్గురు సాధువులను మంచానికి కట్టివేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఆపై కత్తితో పొడిచి మెడను కోశారు. ఈ ఘటలో ఇద్దరు సాధువులు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన సాధువును వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆలయంలోని సాధువులు హత్యకు గురయ్యారన్న వార్త వెలుగులోకి రావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ అల్లర్లకు దిగారు. దుకాణాలను తగలబెట్టారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అదనపు పోలీసు బలగాలను దింపారు. కాగా, గత కొంతకాలంగా ఔరైయాలో గోవధ జరుగుతోంది. దీనిని వ్యతిరేకించడం వల్లే సాధువులను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News