China: భారత భూభాగంలోకి దూసుకొచ్చి టెంట్లు వేసిన చైనా సైన్యం!

  • లడఖ్ లో 300 మీటర్లు చొచ్చుకొచ్చిన చైనీయులు
  • చైనా అధికారులతో మాట్లాడిన భారత సైన్యం
  • తరచూ చొరబాట్లకు పాల్పడుతున్న డ్రాగన్ దేశం

జిత్తులమారి చైనా మరోసారి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. సిక్కిం సమీపంలోని డోక్లాం ఘటనను మర్చిపోకముందే ఈసారి ఏకంగా లడఖ్ లో తిష్ట వేసింది. లడఖ్ వద్ద భారత భూభాగంలోకి 300 మీటర్ల మేర చొచ్చుకొచ్చిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు.. అక్కడ టెంట్లు వేసుకున్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దీంతో స్థానికంగా గొర్రెలు, గుర్రాలను మేపుకునే నోమద్ సంచార జాతి ప్రజలు ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులకు తెలిపారు. దీంతో స్పందించిన ఆర్మీ చైనా ఉన్నతాధికారులతో మాట్లాడటంతో వెంటనే చైనీయులు టెంట్లను తీసేసి వెనక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం భారత్-చైనాల మధ్య 4,000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అయితే ఇరుదేశాల మధ్య సరిహద్దుగా ఉన్న మెక్ మోహన్ రేఖను చైనా అంగీకరించడం లేదు. అంతేకాకుండా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ అంతా తమదేనని డ్రాగన్ దేశం వాదిస్తోంది.

భారత భూభాగంలోకి చైనా దూసుకురావడం కొత్తేం కాదు. 2017లో చైనా సైనికులు 426 సార్లు, 2016లో 273 సార్లు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. గతేడాది సిక్కిం సమీపంలోని డోక్లామ్ లో చైనా సైన్యం తిష్ట వేయడంతో భారత సైన్యం ప్రతిఘటించింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. చివరికి చైనా బలగాలు ఆగస్టు 28న వెనక్కి తగ్గాయి.

More Telugu News