auto driver: మహిళను అదోలా చూసినా జైలుకే!

  • ఆటో డ్రైవర్ కు జైలు శిక్ష విధించిన కోర్టు
  • ఆటోలో ఉన్న మహిళను అద్దంలో చూస్తూ ఇబ్బంది పెట్టిన డ్రైవర్
  • షీటీమ్స్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, కామెంట్లు చేయడం మాత్రమే నేరం కాదు... వారికి ఇబ్బంది కలిగేలా చూసినా నేరమే. తాజాగా... ఆటోలో కూర్చున్న ఓ ప్రయాణికురాలిని చూపులతో ఇబ్బంది పెట్టిన ఓ ఆటో డ్రైవర్ కు 14 రోజుల జైలు శిక్షను విధించింది కోర్టు. ఈ ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, నగరంలోని ఆసిఫ్ నగర్ కు చెందిన ఓ మహిళ మెహిదీపట్నంలో పని చేస్తోంది. గత నెల 25న తన కార్యాలయం నుంచి ఆటోలో ఇంటికి బయల్దేరింది. ఈ సందర్భంలో ఆటో డ్రైవర్ మహ్మద్ మొహినుద్దీన్ ఆటోలో ఉన్న అద్దాన్ని అటూ, ఇటూ తిప్పుతూ సదరు మహిళను చూడసాగాడు.

ఆటో డ్రైవర్ ప్రవర్తనతో చాలా ఇబ్బంది పడ్డ బాధితురాలు షీటీమ్స్ కు ఫిర్యాదు చేసింది. దీంతో, గోల్కొండ ప్రాంతంలో ఉండే మొహినుద్దీన్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి... మొహినుద్దీన్ కు 14 రోజులు జైలు శిక్షను విధించారు. 

More Telugu News