One Nation One Election: 11 రాష్ట్రాలకు, పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు: జమిలికి ఓకే చెప్పిన బీజేపీ

  • జమిలికి అనుకూలమేనన్న అధికార పార్టీ
  • న్యాయ కమిషన్ కు అమిత్ షా లేఖ
  • లోక్ సభ ఎన్నికలతో పాటు సాధ్యమైనన్ని ఎక్కువ రాష్ట్రాలకు ఎన్నికలు!

'ఒకే దేశం - ఒకే ఎన్నికలు' అంటున్న బీజేపీ, జమిలి ఎన్నికలకు తాము అనుకూలమేనని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా న్యాయ కమిషన్ చీఫ్ కు లేఖ రాశారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఏడాదిన్నరలోపు ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కూడా కలుపుకుపోవాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికలతో పాటే 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపించాలని భావిస్తోంది.

ఈ సంవత్సరం చివరిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ రాష్ట్రాలకు, ఆపై జూన్ లోగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మిజోరంలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటన్నింటినీ కలిపి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రానికి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కొన్ని విపక్ష పార్టీలు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ, ఏకకాల ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుందని, ఏడాది పొడవునా ఎన్నికల వాతావరణం లేకుండా చేయవచ్చని బీజేపీ వాదిస్తోంది.

కాగా, అమిత్‌ షా రాసిన లేఖను సోమవారం నాడు పార్టీ నేతలు న్యాయ కమిషన్‌ కు అందించారు. రెండు దఫాల్లో అన్ని రాష్ట్రాల ఎన్నికలు పూర్తి చేయడం వల్ల సమాఖ్య విధానం బలోపేతం అవుతుందని ఈ లేఖలో అమిత్ షా వ్యాఖ్యానించారు. తరచూ ఎన్నికల కారణంగా, నియమావళి అమలవుతూ, అభివృద్ధికి, విధాన నిర్ణయాల అమలుకు అవరోధం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార ఎన్డీఏతో పాటు అకాలీదళ్, ఏఐఏడీఎంకే, సమాజ్‌ వాదీ, టీఆర్‌ఎస్‌ ఏకకాల ఎన్నికలను సమర్ధించగా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీడీపీ, జేడీఎస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News