Jagan: మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది?: 'ఈడీ చార్జిషీటులో భారతి పేరు' వార్తపై జగన్ బహిరంగ లేఖ

  • ‘ముద్దాయిగా భారతి’ వార్తపై జగన్ మండిపాటు 
  • జడ్జి పరిగణనలోకి తీసుకోకముందే కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది?
  • ఎవరు వారికి చెప్పారు?

తన భార్య భారతిని నిందితురాలిగా చేరుస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్ ను దాఖలు చేసిందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి షాకయ్యానని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయమై మరోమారు జగన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు జగన్ బహిరంగ లేఖ రాశారు.

‘ఈడీ కేసులో నిందితురాలిగా వైయస్ భారతి’ అంటూ ‘ఈనాడు’లో, ‘ముద్దాయిగా భారతి’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ఈరోజు ప్రచురించిన వార్తను చూసి నిర్ఘాంతపోయాను. తనను ఫలానా కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిందితురాలిగా చేరుస్తున్నారన్న వార్తను శ్రీమతి భారతి, నేను ఈరోజు ఉదయం ఎల్లో పత్రికలు, సెలెక్టివ్ గా ఒకటి రెండు ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్త చూసి తెలుసుకోవాల్సి వచ్చింది.

జడ్జీగారు పరిగణనలోకి తీసుకున్న తరువాతే చార్జిషీట్ లో ఏముంది? అన్న విషయం మాకైనా, ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది జడ్జీగారు పరిగణనలోకి తీసుకోకముందే.. మాకే తెలియకుండా, ఈ విషయం నేరుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది? ఎవరు వారికి చెప్పారు? మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? .. కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచటం మంచిదన్న అభిప్రాయంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను’ అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. 

More Telugu News