Amrapali group: అతి తెలివి చూపించవద్దు.. మీకే ఇళ్లు లేకుండా చేస్తాం!: ‘ఆమ్రపాలి’ సంస్థకు సుప్రీం వార్నింగ్

  • గడువులోగా ప్రజలకు ఫ్లాట్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం
  • డైరెక్టర్ల ఆస్తులు వేలం వేసైనా ప్రాజెక్టు చేపడతామని హెచ్చరిక
  • 15 రోజులలోగా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశం

డిపాజిట్లు తీసుకుని నిర్ణీత గడువులోగా ఫ్లాట్లను యజమానులకు అప్పగించని ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. తమ ముందు అతితెలివి ప్రదర్శించవద్దనీ, గడువులోగా పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించింది. లేదంటే కంపెనీ డైరెక్టర్ల ఇళ్లను స్వాధీనం చేసుకుని నిలువనీడ లేకుండా చేస్తామని హెచ్చరించింది.

తమ ఆదేశాలను పాటించకుంటే కంపెనీ డైరెక్టర్ల ఆస్తుల్ని వేలం వేసైనా ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుల్ని రాబడతామని జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. డైరెక్టర్లు, కంపెనీ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను 15 రోజులలోగా తమ ముందు ఉంచాలని సుప్రీం ఆదేశించింది.

ఆమ్రపాలి సంస్థ నిధుల లేమి కారణంగా డిపాజిట్లు చెల్లించిన 42,000 మందికి వారి ఇళ్లను అప్పగించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును తాము చేపడతామని జాతీయ భవనాల నిర్మాణ కార్పొరేషన్(ఎన్ బీసీసీ) ఈ నెల 2న కోర్టుకు తెలిపింది. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను 30 రోజులలోగా తమకు సమర్పించాలని సుప్రీం ఎన్బీసీసీని ఆదేశించింది.

More Telugu News