Virat Kohli: ఓటమిలోనూ కోహ్లీ రికార్డు!

  • తొలి టెస్టులో ఓడిన టీమిండియా
  • బ్రియాన్ లారా రికార్డును సమయం చేసిన కోహ్లీ
  • సెంచరీలు చేసిన ఐదు మ్యాచుల్లోనూ ఓటమి

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు చివరి వరకు పోరాడి ఓడింది. తొలుత విజయం మెట్టుపై నిలబడిన కోహ్లీ సేన అనంతరం అక్కడి నుంచి జారి ఓటమి అంచుల్లోకి చేరి చివరికి చేతులెత్తేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీ అద్భుతంగా పోరాడినప్పటికీ ఓటమి నుంచి మాత్రం జట్టును కాపాడలేకపోయాడు. సహచరుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో కోహ్లీ ఒంటరి పోరాటం ఫలితాన్నిఇవ్వలేకపోయింది.

ప్రతిష్ఠాత్మక తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ స్కిప్పర్ కోహ్లీ ఖాతాలో మాత్రం అరుదైన రికార్డు వచ్చి చేరింది. భారత్ ఓడిపోయిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా సరికొత్త రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సెంచరీలు చేసిన ఐదు టెస్టుల్లో టీమిండియా ఓటమి పాలైంది.

విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో అతడు సెంచరీలు చేసిన ఐదు మ్యాచుల్లోనూ జట్టు ఓటమి పాలైంది. ఇప్పుడా రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా 4 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.   

More Telugu News