Virat Kohli: కోహ్లీని ఆకాశానికెత్తేసిన పాక్ మాజీ స్పీడ్ స్టర్

  • కోహ్లీ సెంచరీ అద్భుతం
  • ఇంగ్లండ్ లో రాణించలేడన్న విమర్శలకు సమాధానం ఇచ్చాడు
  • ప్రపంచ బ్యాట్స్ మెన్లకు కోహ్లీ ఒక బెంచ్ మార్క్

ఎడ్జ్ బాస్టన్ లో అద్భుతమైన శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ వైపు వికెట్లు టపటపా రాలిపోతున్నా... టెయిలెండర్లతో కలసి స్కోరు బోర్డును ఉరికించాడు కోహ్లీ. 182 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినా, పట్టుదలతో ఆడిన కోహ్లీ 149 పరుగులు సాధించాడు. కోహ్లీ ఆపద్బాంధవుడి పాత్రను పోషించకపోతే మ్యాచ్ పై ఇంగ్లండ్ పట్టు సాధించి ఉండేది.

ఈ నేపథ్యంలో కోహ్లీని ఆకాశానికెత్తేశాడు పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అఖ్తర్. "అద్భుతమైన సెంచరీ. చివరిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కోహ్లీ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కానీ ఈ సారి మాత్రం తాను ఎంత గొప్ప ఆటగాడో నిరూపించుకున్నాడు. అతని పట్టుదల, అంకితభావం చాలా గొప్పవి. ఈ టూర్ లో కూడా రాణించలేడంటూ అతనిపై వచ్చిన కామెంట్లకు సరైన సమాధానం చెప్పాడు. నన్ను అమితంగా ఆకట్టుకున్నది ఏమిటంటే... టాప్ ఆర్డర్ తో కలసి ఆడుతున్నప్పుడు ఎంత స్ట్రయిక్ రేట్ మెయింటెయిన్ చేస్తాడో... లోయర్ ఆర్డర్ తో కలసి ఆడుతున్నప్పుడు కూడా అదే స్ట్రయిక్ రేట్ మెయింటెయిన్ చేయడం. ఇది సాధారణ విషయం కాదు. ప్రపంచ బ్యాట్స్ మెన్లు అందరికీ కోహ్లీ ఒక బెంచ్ మార్క్" అంటూ ట్వీట్ చేశాడు. 

More Telugu News