Maharashtra: ప్రాణం తీసిన ప్లాస్టిక్ నిషేధం.. మహారాష్ట్రలో వ్యాపారి ఆత్మహత్య!

  • ప్రభుత్వ నిషేధంతో ఆవేదన చెందిన నరేశ్
  • ప్రత్యామ్నాయ మార్గంలేక బలవన్మరణం
  • మహారాష్ట్ర సర్కారుపై మృతుడి కొడుకు ఆగ్రహం

ఓ వైపు ప్లాస్టిక్ బ్యాగులపై ప్రభుత్వం నిషేధం విధించడం, మరోవైపు వేరే వ్యాపారాలు చేసేందుకు ఆర్ధిక స్తోమత లేకపోవడంతో ఆవేదన చెందిన ఓ ప్లాస్టిక్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దాదాపు వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాగ్ పూర్ కు చెందిన నరేశ్ తొలానీ(51)కి భార్య దివ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హోల్ సేల్ గా ప్లాస్టిక్ బ్యాగుల్ని కొనుగోలు చేసే నరేశ్ వాటిని చిన్నచిన్న షాపులకు అమ్మేవాడు. గత 30 ఏళ్లుగా ఆయన ఇదే వ్యాపారం చేస్తున్నాడు. కానీ 3 నెలల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధిస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో బ్యాగుల అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో నరేశ్ ఆర్థికంగా చితికిపోయాడు. జూలై 23 నుంచి పూర్తిస్థాయి నిషేధం అమల్లోకి రావడంతో ప్లాస్టిక్ బ్యాగుల అమ్మకం పూర్తిగా నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు లోనైన నరేశ్.. ‘ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధంతో అలసిపోయాను. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు’ అని సూసైడ్ నోట్ రాసి జూలై 29న ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. చివరికి ఇంటికి సమీపంలోని ఓ సరస్సులో శవమై తేలాడు. నెల రోజుల క్రితం నరేశ్ బేకరీ పెట్టాలని అనుకున్నాడనీ, అయితే అందుకు తగ్గ పెట్టుబడి లేకపోవడంతో వెనక్కి తగ్గాడని స్నేహితుడొకరు మీడియాకు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం నిషేధానికి కేవలం మూడు నెలల గడువు మాత్రమే ఇవ్వడంతో, మరోదారి లేక తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుమారుడు సుమిత్ ఆరోపించాడు.

More Telugu News