Aurangzeb: ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ హత్యపై రగులుతున్న స్నేహితులు.. ఉగ్రవాదులపై ప్రతీకారానికి సౌదీ నుంచి తిరిగొచ్చిన 50 మంది!

  • ఔరంగజేబ్ ను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు 
  • భారీ జీతాలను వదులుకుని స్వగ్రామానికి
  • ఆర్మీ, పోలీసుల్లో చేరుతామని ప్రకటన

కశ్మీర్ లో రంజాన్ సందర్భంగా ఇంటికి వెళుతున్న ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ ను ఉగ్రవాదులు ఇటీవల కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న విదేశాల్లోని గ్రామస్తులు ప్రతీకారం తీర్చుకునేందుకు స్వస్థలానికి చేరుకున్నారు.

పూంచ్ జిల్లాలోని మెంధర్ మండలం సలాని గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ ను జూన్ లో కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు దారుణంగా హత్యచేశారు. సౌదీ అరేబియాలో ఉంటున్న ఆ గ్రామ యువకులు ఈ విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. తమ సోదరుడ్ని చంపినవాళ్లను మట్టుబెట్టేందుకు ఉద్యోగాలకు రాజీనామా చేసిన 50 మంది యువకులు.. అప్పటికప్పుడు స్వగ్రామానికి బయలుదేరారు.

ఈ విషయమై మొహమ్మద్ కిరామత్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘ఔరంగజేబ్ ను ఉగ్రవాదులు చంపారని తెలియగానే నా ఉద్యోగానికి రాజీనామా చేసి, వెంటనే స్వస్థలానికి బయలుదేరా. నాలాగే దాదాపు 50 మంది యువకులు భారీ జీతభత్యాలను వదులుకుని సలానీకి తిరిగివచ్చారు. మా అందరి లక్ష్యం ఔరంగజేబ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడమే’ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల్ని వేటాడేందుకు తామంతా ఆర్మీ, పోలీస్ విభాగంలో చేరుతామని ప్రకటించాడు.

More Telugu News