East Godavari District: మా పామును ఎస్ఐ విషం పెట్టి చంపించాడు!: దుర్గాడ ప్రజల ఆగ్రహం

  • 26 రోజులుగా ప్రజలకు హాని తలపెట్టని సర్పరాజం
  • ఎస్ఐ విషం పెట్టించి చంపాడంటున్న ప్రజలు
  • నిరసనలతో అట్టుడికిన దుర్గాడ

దాదాపు 26 రోజులుగా తమతో పూజలందుకుంటూ, ఎవరినీ ఏమీ చేయని నాగరాజు హఠాన్మరణంతో తూర్పు గోదావరి జిల్లా దుర్గాడ శోకసంద్రమైంది. పాము మృతికి స్థానిక ఎస్ఐ శివకృష్ణ కారణమని ఆరోపిస్తూ, ప్రజలు జాతీయ రహదారిని ఏడు గంటల పాటు దిగ్బంధించడంతో ఆ ఎస్ఐని విధుల నుంచి తప్పిస్తున్నట్టు డీఎస్పీ ప్రకటించారు.

ఓ వస్త్రం తెచ్చి, దానిపై మందు వేసి పామును ఆయన చంపించాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుబుసం విడిచిన తరువాత కూడా ఎక్కడికీ వెళ్లకుండా, తమతోనే ఉన్న పాము వద్ద ఎస్ఐతో పాటు వచ్చిన వ్యక్తి ఓ వస్త్రాన్ని వదిలి వెళ్లాడని, ఆపై కాసేపటికే పాము మృతి చెందిందని గ్రామస్తులు ఆరోపించారు.

ఆపై జాతీయ రహదారి నంబర్ 216పై పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలకు దిగారు. రోడ్డుపై మంటలు వేశారు. దీంతో ట్రాఫిక్ ను చెందుర్తి, తాటిపర్తి సెంటర్ మీదుగా మళ్లించిన అధికారులు, దుర్గాడ ప్రజలతో చర్చలకు ఉన్నతాధికారులను పంపారు. కాకినాడ డీఎస్పీ అక్కడికి చేరుకుని, ప్రజలతో చర్చించారు. ఎస్ఐని విధుల నుంచి తొలగిస్తున్నామని, పాము మృతిపై విచారణ జరిపిస్తామని, కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని నచ్చజెప్పడంతో ప్రజలు శాంతించారు.

More Telugu News