Preeti Zinta: నెస్ వాడియా కేసులో ప్రీతీ జింటా స్పందనను కోరిన కోర్టు!

  • 2014, మే 20న ఘటన
  • స్టేడియంలో ప్రీతిని తిట్టిన నెస్ వాడియా
  • ఆ ఘటనను మరచిపోవాలని భావించామని కోర్టుకు వెల్లడి
  • కేసు కొట్టేసే విషయమై ప్రీతి స్పందన కోరిన బాంబే హైకోర్టు

నాలుగేళ్ల నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రీతీ జింతాను వేధించాడని నెస్ వాడియాపై దాఖలైన కేసు, బాంబే హైకోర్టు ముందుకు విచారణకు రాగా, స్పందించాలని ప్రీతీ జింటాను కోర్టు ఆదేశించింది. ఈ కేసును కొట్టి వేయాలని పిటిషన్ దాఖలు చేసిన నెస్ వాడియా, తామిద్దరమూ నాటి ఘటనను మరచిపోవాలని నిర్ణయించుకున్నట్టు న్యాయవాది ద్వారా చెప్పించారు.

ప్రస్తుతం ప్రీతీ జింటా పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటోందని, తాము కలసి ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పాల్గొన్నామని తెలిపారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఆర్ఎం సావంత్, జస్టిస్ రేవతీ మోహితే, కేసును కొట్టి వేయడంపై అభిప్రాయం తెలపాలని ప్రీతిని ఆదేశించింది.

కాగా, మే 20, 2014న వాంఖడే మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ ఆడుతున్న వేళ, టికెట్ల పంపిణీపై వివాదం నెలకొనడంతో, నెస్ వాడియా టీమ్ స్టాఫ్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఆ సమయంలో ప్రీతీ వెళ్లి వాడియాను వారించబోగా, ఆమెను తిడుతూ, బలంగా చెయ్యి పట్టుకుని పక్కకు నెట్టేశాడు. దీనిపై జూన్ 13న ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐపీసీ సెక్షన్ 354, 504, 506, 509 కింద కేసు నమోదైంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చార్జ్ షీట్ ఫైల్ కాగా, దాన్ని కొట్టి వేయాలని నెస్ వాడియా కోర్టును ఆశ్రయించారు.

More Telugu News