యాదగిరిగుట్టలో వ్యభిచార దందా... మంచం కింద సొరంగం నుంచి నలుగురు బాలికలను రక్షించిన పోలీసులు!

02-08-2018 Thu 11:03
  • వరుసగా మూడో రోజూ తనిఖీలు
  • మంచం కింద గోడను తొలుస్తూ నిర్మాణం
  • మరిన్ని ఇళ్లలో ఇవే నిర్మాణాలు ఉండవచ్చని అనుమానం
వ్యభిచార కంపుతో నిండిపోయిన యాదగిరిగుట్ట ప్రక్షాళనలో భాగంగా పోలీసులు వరుసగా మూడో రోజూ తనిఖీలు చేపట్టారు. నేటి తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో నలుగురు బాలికలు పట్టుబడ్డారు. ఇదే ఇంటిలో రెండు రోజుల క్రితం కూడా తనిఖీలు చేసిన సమయంలో, వారెవరూ పట్టుబడలేదు. కానీ, ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో మరోసారి దాడికి వెళ్లిన పోలీసులు, గదిలోని మంచం కింద గోడను తొలుస్తూ మూడు అడుగుల వెడల్పుతో ఉన్న సొరంగంలో బాలికలను దాచారని గుర్తించి విస్తుపోయారు.

పోలీసులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం తెలిస్తే, వారిని ఆ సొరంగంలోకి పంపిస్తారని, అందులో ఆరుగురు పట్టే వీలుందని, బయటకు ఎంతమాత్రమూ అనుమానం రాని విధంగా దాన్ని నిర్మించి, మంచాన్ని అడ్డు పెట్టారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పట్టణంలోని పాత నరసింహస్వామి దేవాలయానికి వెళ్లే దారిలోని మరిన్ని ఇళ్లలో ఇదే తరహా నిర్మాణాలు ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నాయని, మరింత విస్తృతంగా తనిఖీలు చేస్తామని చెప్పారు.