యాదాద్రి లాడ్జీలపై ఏకకాలంలో దాడులు... వ్యభిచారానికి వచ్చిన 8 జంటల అరెస్ట్!

01-08-2018 Wed 11:51
  • గుట్టలో పెరిగిన అసాంఘిక కార్యకలాపాలు
  • పలు లాడ్జీలపై ఒకేసారి దాడులు చేసిన పోలీసులు
  • రూములిచ్చిన యజమానుల పైనా కేసులు
తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో వ్యభిచారం పెరిగిపోయిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో పడాయిగూడెం శివార్లలోని లాడ్జీలపై ఏకకాలంలో దాడులు చేసిన పోలీసులకు ఎనిమిది జంటలు పట్టుబడ్డాయి. వీరంతా తమ వివరాలు సరిగ్గా చెప్పకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వచ్చిన వారి వివరాలు తెలుసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా రూములు అద్దెకు ఇచ్చిన లాడ్జీల యజమానులపైనా కేసులు పెట్టారు.

 శ్రీలక్ష్మీనరసింహ లాడ్జి, శ్రీధ లాడ్జిలో ఒక్కో జంట చొప్పున, ఎస్‌ఎన్‌ లాడ్జిలో, శ్రీ లక్ష్మీలాడ్జిలో మూడు జంటల చొప్పున అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన జంటలు ఇక్కడి లాడ్జీల్లో రూములు తీసుకుని వ్యభిచారానికి పాల్పడుతుండగా, ఎన్ని కేసులు పెట్టినా అసభ్య కార్యక్రమాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. ఇక భువనగిరిలోని లాడ్జీల్లో సైతం అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపణలు వస్తుండటంతో వాటిపైనా దృష్టిని సారించనున్నామని తెలిపారు.