కాంగ్రెస్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వాస్తవం!: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
- కాంగ్రెస్ పై ప్రజల్లో కోపం తగ్గుతోందన్న చంద్రబాబు వ్యాఖ్యలు నిజం
- హామీలు నెరవేర్చని బీజేపీ ఒక లిటిగెంట్ పార్టీ
- కిరణ్ ఏడాది క్రితమే వచ్చుంటే బాగుండేది
కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు కోపం తగ్గుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా... ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నిజమని రఘువీరా అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పై ద్వేష భావం ఉండేదని... ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయని చెప్పారు. ఏపీ అంశాన్ని ఈరోజు జాతీయ అజెండాగా చేశామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏడాది క్రితమే కాంగ్రెస్ లోకి వచ్చి ఉంటే చాలా బాగుండేదని రఘువీరా అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితమే రాహుల్ గాంధీని ఆయన కలిశారని... కిరణ్ చేరిక గురించి రాహుల్ తనతో ప్రస్తావిస్తే... మేమంతా సరేనన్నామని తెలిపారు. కిరణ్ రాకతో పార్టీ మరింత బలోపేతమయిందని... అందరితో కలసి ఆయన పని చేస్తారని చెప్పారు.